ఎల్లారెడ్డి రూరల్, మే 3:పైర్లకు వేపపూత యూ రియా వాడడంతో బహుళ ప్రయోజనాలున్నాయి. మార్కెట్లో సాధారణ యూరియా, వేపపూత యూరి యా వేర్వేరుగా లభిస్తున్నది. ఇక నుంచి వేపపూత యూరియానే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం సంబంధిత కంపెనీలకు ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం.
వేపతో ప్రయోజనాలు
వేపచెట్టు రైతు నేస్తం. వేపగింజలు, ఆకులు, నూనె, బెరడు, వేర్లు ఇలా ప్రతి భాగం ఉపయోగమే. ఇలాంటి లక్షణాలతో వేప వృక్ష సంబంధిత క్రిమిసంహారిణిగా పేరు పొందింది. వేపగింజల్లో నూనె అధికశాతం ఉండడంతో వేప విలువ మరింత పెరిగింది.
యూరియాతో మేలు
పంటకు 80శాతం నత్రజని పోషకాన్ని యూరియా రూపంలోనే అందిస్తారు. యూరియాలో నత్రజనితోపాటు 20శాతం కర్బనం, 26శాతం ఆక్సిజన్, 6 శాతం హైడ్రోజన్ మూలకాలు ఉంటాయి. సాధారణ యూరియాతో నత్రజని పోషకాన్ని పూర్తిగా ఉపయోగించుకోక వృధాగా భూమిలోకి పోతుంది. కానీ వేపపూత యూరియా మాత్రం అందుకు భిన్నంగా పనిచేస్తుంది. రెండు విలువైన ప్రక్రియల సమ్మేళన ఫలితంగా వేపపూత యూరియా తయారవుతుంది. గాలి, సహజ వాయువుల ఆధారంగా యూరియా తయారీ మొదటి అంశం, ఆ తర్వాత సన్న యూరియా తయారీ చివరిదశలో ఒకేలా వేపనూనెను పూతగా పట్టించడం రెండో అంశం. వేపనూనెను యూరియా మీద ఒకపొర మాదిరిగా ఏర్పాటుచేయడంతో రైతులకు పలువిధాలుగా లాభాలున్నాయి.
వేపపూత యూరియాతో లాభాలు
సాధారణంగా యూరియా తేమను గ్రహించి బస్తాలో కొంతమేర గడ్డ కడుతుంది. వేపపూత యూరియాలో వేపనూనె యూరియా గుళికలపై పొరలా ఏర్పడుతుంది. దీంతో యూరియా తేమను త్వరగా గ్రహించలేదు.