కామారెడ్డి, జూన్ 11: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో తాగునీటి సరఫరాపై కలెక్టర్ జితేశ్ పాటిల్‌తో కలిసి మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, జిల్లా పంచాయతీ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి మున్సిపాలిటీల్లో 18,800 ఇండ్లకు రోజుకు 18.23 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా మిషన్ భగీరథ, పెద్ద చెరువు, బోర్‌వెల్స్ ద్వారా 10.59 మిలియన్ లీటర్ల నీటిని రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నామన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇందల్వాయి నుంచి మల్లన్నగుట్ట వరకు 24.7 కిలోమీటర్ల మేర రూ.195 కోట్లతో నూతన పైపులైన్ నిర్మాణం చేపట్టనున్నామని, టెండర్లు కూడా పూర్తయినట్లు తెలిపారు. అమృత్ 2.0 కింద కామారెడ్డి మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాకు రూ.93 కోట్లతో రూపొందించిన కార్యక్రమం అగ్రిమెంట్ కావాల్సి ఉన్నదని, త్వరలో అగ్రిమెంట్ చేసుకొని పనులు ప్రారంభిస్తామన్నారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనుల ప్రగతిని సమీక్షిస్తూ పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ.375 కోట్ల నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని ఇరిగేషన్ ఈఈ విద్యావతికి సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇం దూప్రియ, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ ఎస్ఈ రాజేంద్ర కుమార్, మున్సిపల్ కమిషనర్ సుజాత, డీపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.