నవీపేట, జూన్ 15 : నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన మేకల సంతలో రికార్డు స్థాయిలో జీవాల క్రయవిక్రయాలు జరిగాయి. బక్రీద్ పండుగను పురస్కరించుకొని తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల నుంచి తరలివచ్చిన వ్యాపారులు, ప్రజలు జీవాల కొనుగోలుకు పోటీపడ్డారు. ఒక్కరోజే రూ.4కోట్లకు పైగా మేకలు, గొర్రెల క్రయవిక్రయాలు జరిగినట్లు పంచాయతీ అధికారులు పేర్కొన్నారు. ఒక్కో మేక పొట్టేలు రూ. 15 వేల నుంచి రూ.18వేల వరకు ధర పలికింది. కొనుగోలు, విక్రయదారులతో నవీపేట మొత్తం సందడి వాతావరణం నెలకొన్నది.
రెంజల్, జూన్ 15: మండలంలోని సాటాపూర్ పశువుల సంతలో శనివారం సందడి వాతావరణం నెలకొన్నది. 17న బక్రీద్ సందర్భంగా పశువుల కొనుగోళ్లకు డిమాండ్ పెరిగింది. సంతకు ఆశించిన స్థాయిలో కంకలు రాలేదు. మహారాష్ట్రలోని నాందెడ్ పట్టణానికి చెందిన వ్యాపారి రూ.లక్షా80వేలకు ఓ కంకను కొనుగోలు చేశాడు. పశువుల కొనుగోళ్లకు అనుమతిపత్రాలు తప్పనిసరి కావడంతో వ్యాపారులు గ్రామ పంచాయతీ వద్ద పెద్ద ఎత్తున బారులుతీరారు. బోధన్ రూరల్ సీఐ నరేశ్‌కుమార్, ఎస్సై సాయన్న బందోబస్తు ఏర్పాటు చేశారు.