Narcotics police raid | వినాయక నగర్, నవంబర్ 20 : నిజామాబాద్ లో కల్తీ కల్లుకు వినియోగించే అల్ర్ర్ఫాజోలం (మత్తుమందు) వాడకం పెరిగిపోవడంతో దాని నియంత్రించేందుకు నార్కోటిక్ బృందం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో కొంతమంది కల్లు డిపోలల్లో అల్ర్ర్ఫాజోలం వినియోగించి కల్తీ కల్లు తయారు చేసి విక్రయాలు జరుగుతున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో దాడులు ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగా గురువారం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారులో అల్ర్ర్ఫాజోలం తరలిస్తున్నట్లుగా సమాచారం అందడంతో నార్కోటిక్ ఇన్స్పెక్టర్ పూర్ణేశ్వర్, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో శ్రీనివాస్ తమ టీమ్లతో కలిసి గంగాస్థాన్ ప్రాంతంలో కారును పట్టుకొని తనిఖీలు నిర్వహించారు.
దీంతో కారులో రూ.1.5 లక్షల విలువచేసే 150 గ్రాముల అల్ర్ర్ఫాజోలం (మత్తు పదార్థం) పట్టుకున్నారు. ఈ మత్తు పదార్థాన్ని నిజామాబాద్ నుండి మొదక్ పల్లి కి తరలిస్తున్న మోపాల్ మండలం మొదక్ పల్లి ప్రాంతానికి చెందిన రాజా గౌడ్ తో పాటు శ్రీనివాస్ గౌడ్, సుజీత్ గౌడ్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని కారును సీజ్ చేశారు. అల్ర్ర్ఫాజోలం తో పట్టుబడిన ముగ్గురి పై రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్హెచ్వో శ్రీనివాస్ కేసు నమోదు చేశారు.