కంఠేశ్వర్ : నిజామాబాద్ ( Nizamabad ) జిల్లా కేంద్రంలోని 20వ డివిజన్ కంటేశ్వర్ బ్యాంక్ కాలనీ నెలకొన్న సమస్యలపై నమస్తే తెలంగాణ వెబ్ న్యూస్ ( Web News Effect ) ఇచ్చిన వార్తకు మున్సిపల్ అధికారులు స్పందించారు. కేవలం గంటల వ్యవధిలోనే అక్కడికి చేరుకుని పేరుకుపోయిన చెత్తను తొలగించారు. వెబ్న్యూస్ ఇచ్చిన వార్త వల్లే అధికారులు చెత్తను తొలగించారని స్థానికులు ‘నమస్తే తెలంగాణ వెబ్’ ను అభినందించారు.
బ్యాంక్ కాలనీ డంపింగ్ యార్డ్ ( Dumping yard) ను తలపిస్తుందని, కాలనీలో ఏ మూల చూసినా చెత్తతో నిండిపోయి రోడ్లన్నీ దుర్గంధంగా మారాయని ఫోటోలతో కూడిన వార్తను ప్రచురించింది. చెత్త సేకరణ, పారిశుద్ధ్యం ( Sanitation ) గురించి అధికారులు మాట్లాడడమే తప్ప క్షేత్రస్థాయిలో పరిశీలన కనిపించడం లేదని ఆరోపించింది.
సమయపాలన లేకుండా వచ్చే చెత్త సేకరణ ఆటోలు అందుబాటులో ఉన్న చెత్తను సేకరించి వెళ్లిపోతున్నారని, కాలనీకి చెత్త సేకరించే ట్రాక్టర్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొందని కాలనీవాసుల ఇబ్బందులను ప్రచురించింది. రోడ్ల పైన చెత్త కారణంగా కాలనీలో దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారని వెబ్ పేర్కొంది. వార్త ప్రసారం కావడంతో మున్సిపల్ అధికారులు సిబ్బందిని హుటాహుటినా అక్కడికి పంపి పేరుకుపోయిన చెత్తను తొలగించారు.