ఖలీల్వాడి, ఫిబ్రవరి 20: వాహన ప్రియుల కోసం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆటో షో శనివారం ప్రారంభం కానున్నది. ప్రభుత్వ పాలిటెక్నిక్ గ్రౌండ్లో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో దిగ్గజ వాహన కంపెనీలు తమ అధునాతన మోడళ్లను అందుబాటులో ఉంచనున్నాయి. వాహనాలు కొనుగోలు చేయాలనే వారి కోసం నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే గత కొన్నేళ్లుగా విజయవంతంగా ఆటో షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరోసారి వాహన ప్రదర్శనను ప్రారంభించనున్నది. అన్ని రకాల కార్లు, బైక్ మోడళ్లను కొనుగోలుదారులు ఒకే వేదికపై సందర్శించుకునే అవకాశం కల్పించనుంది.
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆటో షో ఉంటుంది. సందర్శకులకు ఉచిత ప్రవేశంతో పాటు లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందించనున్నారు. ఆటో షోలో స్పాట్ బుకింగ్ సౌకర్యంతో పాటు ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. మెయిన్ స్పాన్సర్ కియా సన్రైజ్, ప్రకాశ్ హ్యుందాయ్, టాటామోటర్స్ ( శ్రీ వెంకటేశ్వర మోటార్స్), నెక్సా (మారుతీ సుజుకి), హర్ష టాయోటా, గ్రీన్ హోండా, నిస్సాన్ (లక్ష్మి నిస్సాన్), వరుణ్ మోటర్స్ (మారుతీ సుజుకి) ఆటోమోటివ్ మహేంద్ర, వెంకటేశ్వర హీరో, లక్ష్మి టీవీఎస్, దేవి ఆటోమొబైల్స్ రాయల్ ఎన్ఫీల్డ్, విజయ గణపతి చేతక్, హోండా (శ్రీరామ్ హోండా) కంపెనీలు తమ వాహనాలను ప్రదర్శనకు ఉంచనున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆటో షో అట్టహాసంగా ప్రారంభం కానున్నది.