నిజామాబాద్ కల్చరల్, నవంబర్ 16: పవిత్రమైన కార్తీకమాసం ప్రారంభం కావడంతో శుభ కార్యాలు జోరందుకున్నాయి. ఏ ఫంక్షన్ హాలు చూసినా సందడిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో పెళ్లిళ్లు చేసుకుంటే సుసంతానం, చక్కని దాంపత్య జీవనం ఉంటుందని పెద్దలు చెప్పడంతో ఈనెల 15 నుంచి డిసెంబర్ 8 వరకు జిల్లా వ్యాప్తంగా వందలాది వివాహాలు జరుగనున్నాయి. ఎన్నికల వేళ.. వివాహాల జోరు ఆయా రాజకీయ పార్టీలను కలవర పెడుతున్నాయి. ఈ యేడు శ్రావణమాసంలో ఆశించిన మేర ముహూర్తాలు లేవు. ప్రస్తుతం నవంబర్, డిసెంబర్ నెలల్లో కార్తీకమాసంలో 8 రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈనెల 16 నుంచి 29 తేదీ మధ్యలో ఎక్కువగా వివాహాల ముహూర్తాలు ఉన్నాయి. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా దానికి ముందు వారం రోజుల పాటు వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. పోటీచేసే అభ్యర్థుల ప్రచారం, వివాహాలు ఒకేసారి జరగనుండడంతో జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది.
గతంలో వివాహానికి హాజరుకావాలని ఆహ్వానం పంపినా ప్రజా ప్రతినిధులు వచ్చేవారు కాదు. ఎన్నికల పుణ్యమాఅని ఈసారి ప్రతి పెండ్లికి పిలువకున్నా అభ్యర్థులు వెళ్లక తప్పేలా లేదని కింది స్థాయి నాయకులు చెబుతున్నారు.ప్రతి ఓటునూ విలువైనదిగా భావింటి పోటీలో ఉన్న అభ్యర్థులు తాము వెళ్లకపోయినా తమ తరపున నాయకులను పంపేందుకు ఆలోచన చేస్తున్నారు. ఆహ్వా నం వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరికీ ప్రాధా న్యం ఇస్తూ వివాహ వేడుకలను తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తున్నారు.
కార్తీక మాసంలో నవంబర్ 16, 19, 21, 22, 23, 24, 26, 29వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని ప్రముఖ పంచాంగకర్త పవన్శర్మ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో సుమారు నాలుగువేల వివాహాలు జరిగే అవకాశం ఉందని పురోహితులు చెబుతుండగా… పెండ్లి సందడిలో పడి ఓటు వేయడం మరచిపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.