Registered case | పోతంగల్, డిసెంబర్ 5 : తల్లి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తే వాల్ పోస్టర్లలో తన కుమారుడు తానే సర్పంచ్ అభ్యర్థిగా పోస్టర్లలో ఫొటో వేయించి వింత ప్రచారం చేశాడు. ఈ ఘటన మండలంలోని హంగర్గ ఫారం లో చోటు చేసుకుంది. ఈ మేరకు ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హంగర్గ ఫారం లో జనరల్ ఉమెన్ రిజర్వేషన్ రావడంతో గ్రామానికీ చెందిన ఓ మహిళా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
అధికారులు ఆమెకు ఓ గుర్తును కేటాయించారు. అభ్యర్థి కుమారుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తన తల్లి ఫొటో పోస్టర్లలో వేయకుండా తన ఫొటోతో పోస్టర్లు ప్రింట్ చేసుకుని ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. ఇలా ప్రచారం చేస్తుండడంపై కొంతమంది ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు వెంటనే పోస్టర్లను తొలగించి అభ్యర్థి కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.