Electric shock | బిచ్కుంద (జుక్కల్) మే10 : విద్యుత్ షాక్ తో తల్లి కూతురు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోనీ పెద్ద గుల్లా తండాలో చోటు చేసుకుంది. ఉక్కపోతతో ఉపశమనం పొందడానికి రాత్రి నిద్రిస్తున్న సమయంలో చల్లదనం కోసం ఏర్పాటు చేసుకున్న కూలర్ తల్లి కూతుర్ల పట్ల మృత్యుపాశమైంది.
జుక్కల్ ఎస్సై భువనేశ్వర్, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని పెద్ద గుల్ల తాండాకు చెందిన శంకబాయి (34) ఆమె కూతురు శివాని (14) శుక్రవారం రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయంలో ఉక్కపోతతో ఉపశమనం పొందడానికి కూలర్ ను ఏర్పాటు చేసుకొని నిద్రించారు. కూలర్ లో ఏదో సమస్య వచ్చి దానికి విద్యుత్ సరఫరా అయ్యింది. నిద్రలోకి జారుకున్న శివాని ఎడమకాలు కూలర్ నీటి తొట్టెలో పడింది. దీనితో విద్యుత్ ప్రవహించి ఆమె కాలు పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది.
శివాని పక్కన నిద్రిస్తున్న ఆమె తల్లి శంకబాయికి శివాని ద్వారా విద్యుత్ సరఫరా అయ్యి షాక్ కొట్టడంతో మృతి చెందింది. శంకబాయి కొడుకు ప్రతీక్ ఇంటి బయట పడుకోవడంతో శనివారం తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లి, చెల్లెలు మృత్యువాత పడడంతో తాండావాసులకు సమాచారం తెలపడంతో వారు విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయించారు. శంకబాయి భర్త ప్రహల్లాధ్ చౌహన్ వృత్తిరీత్యా డ్రైవర్ గా పనిచేయడంతో ఆయన వేరే ప్రాంతాలకు వెళ్ళినట్టు తెలిపారు.
ఇంకో కూతురు బంధువుల వద్దకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందని తాండావాసులు తెలిపారు. దీంతో తాండాలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న బిచ్కుంద సీఐ జగడం నరేష్, జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ తో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మద్నూర్ ఆసుపత్రికి తరలించారు. భర్త ప్రహల్లాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.