బోధన్, ఏప్రిల్ 20: ‘ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి నాపై రాజకీయ కక్షతో నా కుమారుడిని, నా కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేశాడు. చదువుకుంటున్న కుమారుడి భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నించాడు..’ అని బోధన్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్.. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. బోధన్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదర్శన్రెడ్డిది దిగుజారుడు రాజకీయమని, తన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా హైదరాబాద్‌లోని తన ఇంటికి మూడేసి వందల మంది పోలీసులను పంపించారన్నారు.
తనపై తప్పుడు కేసులు బనాయించారని, వాటిలో నిజం లేదన్నారు. ప్రజలకు తాను పదేళ్లపాటు చేసిన సేవలకు శిక్షను అనుభవించేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల తన తల్లి మరణించినప్పటికీ.. ఆయన తనను పరామర్శించడానికి సుదర్శన్‌రెడ్డి రాలేదన్నారు. అదే సుదర్శన్‌రెడ్డి తల్లిదండ్రులు మరణించినప్పుడు తాను స్వయంగా వెళ్లి పరామర్శించడమే కాకుండా జిల్లాలోని అప్పటి ఎమ్మెల్యేలను తీసుకెళ్లానని గుర్తుచేశారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలను సుదర్శన్‌రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడని, వీటిని మానుకుంటే మంచిదని, లేనిపక్షంలో అతడికి అకౌంట్స్ సెటిల్ చేయకతప్పదని హెచ్చరించారు.
బీఆర్ఎస్ సైనికులు కేసులకు భయపడరని, తెలంగాణ ఉద్యమం నడిపిన చరిత్ర బీఆర్ఎస్దని, ఈ విషయం కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాలని అన్నారు. కొంతకాలంగా తాను అనారోగ్యంతో దుబాయ్‌లో ఉన్నానని, ఇక్కడ కాంగ్రెస్ వాళ్లు తనపై దుష్ప్రచారం చేశారని షకీల్ విమర్శించారు. ఇకపై తాను బోధన్‌లో ఉంటానని, ప్రజల పక్షాన పోరాడుతానని, బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక భయపడేదే లేదని ఆయన స్పష్టంచేశారు.
తన పదేండ్ల ఎమ్మెల్యే పదవీకాలంలో బోధన్ నియోజకవర్గం ఎంతో సస్యశ్యామలంగా ఉండేదని, సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వడం ఒక బోగస్‌లా మారిందని, నిజాంసాగర్ కాల్వల్లో నీళ్లు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయి మళ్లీ కేసీఆర్ కావాలంటున్నారని చెప్పారు. సుదర్శన్‌రెడ్డి గతంలో ఇరిగేషన్ మంత్రిగా ఉండి నియోజకవర్గానికి కనీసం ఒక చెక్‌డ్యామ్ కూడా తీసుకురాలేకపోయారని ఆక్షేపించారు. తాను ఇక్కడ లేని సమయంలో తనపై కొన్ని పత్రికలు, కొన్ని చిన్న చిన్న ఛానళ్లు తప్పుడు వార్తలు రాశాయని, నిరాధారంగా ఒకసారి రూ.2000 కోట్లు ఫ్రాడ్ చేశానని చెబుతూ ఇప్పటికీ రూ.7 కోట్లకు దిగివచ్చాయని, ఇప్పుడు అది ఫైన్ మాత్రమే అని చెబుతున్నాయని షకీల్ అన్నారు. తోచినట్లుగా తప్పుడు వార్తలు రాయడం ఏమిటని ప్రశ్నించారు.