నిజామాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. తమకు నచ్చిన పని చేసుకుంటూ పురుషులకు దీటుగా నిలుస్తున్నారు. తాము ఎందులోనూ తక్కువ కాదన్నట్లుగా అడుగు ముందుకేసి విజయతీరాలకు చేరుకుంటున్నారు. అన్ని రంగాల్లోనూ తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న వనితలు రాజకీయాల్లోనూ ప్రాధాన్యతా స్థాయిలో అడుగిడుతున్నారు.
ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం కూడా తోడవుతున్నది. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 50శాతం మేర రిజర్వేషన్లను మహిళలకే కేటాయించడం ద్వారా చాలా మందికి ప్రజా ప్రతినిధులుగా అవకాశం లభించింది. కలలో కూడా ఊహించని పదవులను మహిళలు చేపట్టి తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పురుషులకు దీటుగా రాజకీయ పదవుల్లో తమదైన శైలిలో రాణిస్తున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో వేలాది మంది మహిళలు వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా తమకంటూ గుర్తింపును తెచ్చుకుంటున్నారు.
నిజామాబాద్‌లో ఇలా…
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 29 పాత మండలాల్లో 530 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 27 మండలాల పరిధిలో 4,932 మంది వార్డు సభ్యులు ఉన్నారు. ఇందులో సగానికి ఎక్కువ 2,447 మంది మహిళా వార్డు మెంబర్లు 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 299 మంది ఎంపీటీసీ స్థానాల్లో 165 మందికి అవకాశం వరించింది. వీరిలో కొద్ది మంది ఏకంగా ఎంపీపీలుగా స్థానం దక్కించుకుని జిల్లా పరిషత్‌లోనూ గళం వినిపిస్తున్నారు.
27 మండలాలకు జడ్పీటీసీలుండగా నిజామాబాద్‌లో 14 మంది మహిళలు జడ్పీటీసీలుగా ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఇందులో జడ్పీ వైస్ చైర్మన్ పదవి సైతం మహిళనే అధిరోహించడం విశేషం. సర్పంచుల్లో మొత్తం 528 మందిలో 375 మంది మహిళలే ఉన్నారు. ఇలా నిజామాబాద్ జిల్లాలో అనేక మంది వనితలు సీఎం కేసీఆర్ నిర్ణయంతో రాజకీయ ప్రస్థానాన్ని షురూ చేశారు. కొంత మంది ఏకంగా ఉన్నతమైన పదవులు సైతం వరించడం విశేషం.
కామారెడ్డిలోనూ జోరు…
కామారెడ్డి జిల్లాలో 22 పాత మండలాల పరిధిలో 4,642 వార్డు మెంబర్లలో 2,398 మంది మహిళలే ఉన్నారు. 236 ఎంపీటీసీల్లో 131 మంది వనితలకు అవకాశం దక్కింది. ఇక 22 మంది జడ్పీటీసీలు ఉండగా 11 మంది అబలలకే చోటు దక్కింది. కామారెడ్డి తొలి జిల్లా పరిషత్‌కు చైర్‌పర్సన్‌గా మహిళనే పీఠం దక్కించుకున్నది. నిజాంసాగర్ జడ్పీటీసీగా గెలిచిన దఫేదార్ శోభ అత్యున్నత పదవిని దక్కించుకొని కామారెడ్డి జిల్లా పరిషత్‌కు సారథిగా విజయవంతంగా పని చేస్తున్నారు.
మొత్తం 526 జీపీలు ఉండగా ఇందులో పెద్దకొడప్గల్ మండలంలోని ఓ గ్రామ పంచాయతీకి నేటికీ ఎన్నికలు జరగలేదు. మొత్తం 525 మంది సర్పంచులకు గాను 270 మంది మహిళామణులు గ్రామ ప్రథమ పౌరులుగా వెలుగొందుతున్నారు. మరోవైపు కామారెడ్డి జిల్లాలోనూ ఎంపీపీ పదవుల్లోనూ సగం మంది మహిళలే ఉన్నారు. ఉభయ జిల్లాల్లో స్థానిక సంస్థల్లో వేలాది మంది తమదైన ప్రతిభను కనబరుస్తూ రాజకీయాల్లో రాణిస్తున్నారు. పురుషులతో పోలిస్తే ప్రజాప్రతినిధులుగా మహిళలు చురుగ్గా పాల్గొంటూ మానవీయ పరిపాలనను అందిస్తుండడం విశేషం.
ఐకాన్‌గా ఎమ్మెల్సీ కవిత…
ఉద్యమకారిణిగా, రాజకీయ నాయకురాలిగా, సాంస్కృతిక పునరుజ్జీవంలో కీలక వ్యక్తిగా, వక్త గా, లోక్‌సభ సభ్యురాలిగా, శాసన మండలి స భ్యురాలిగా, ఆపదలో అక్కగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక పేజీలను సృష్టించుకున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బతుకమ్మ సాంస్కృతిక సంబురాన్ని ఖండాంతరాలకు విస్తరించిన ఘనతను చాటుకుని 2014 లో తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా ఎంపీగా విజయం సాధించి లోక్‌సభ వేదికగా అనేక అంశాలపై గళం విప్పి ఖ్యాతిని సంపాదించారు.
జమ్మూకశ్మీర్‌లోని కశ్మీర్ పండిట్ల అంశంతో మొదలు పెడితే అనేక సబ్జెక్టులపై వక్తగా అంతర్జాతీయ సదస్సులో పాల్గొని తనదైన పాత్రను పోషించారు. అనంతరం ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత మండలిలోనూ సామాజిక సమస్యలపై గళం విప్పుతూ ప్రభుత్వం ద్వారా అనేక సమస్యలను పరిష్కరింపజేయడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. భారత్ జాగృతి ద్వారా సామాజిక కార్యక్రమాలను విస్తృతం చేస్తూ సేవలను అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పలు ప్రభుత్వ దవాఖానలు, గ్రంథాలయాల్లో బువ్వకుండ పేరుతో నిత్యం అన్నదానం చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూ పెద్ద మనసును చాటుకుంటూ మహిళలకు ఐకాన్‌గా నిలుస్తున్నారు.