అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ సేవలను ఇందూరు ఐటీ హబ్‌లో ప్రారంభించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. నేడు ఐటీ హబ్‌ను పరిశీలించేందుకు వారు ఇందూరుకు రానున్నారు.
– ఖలీల్‌వాడి, జూలై 31
ఖలీల్‌వాడి, జూలై 31 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన ఐటీ హబ్‌లో కంపెనీ ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన హిటాచీ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన గ్లోబల్ లాజిక్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆ సంస్థ వైస్‌ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజినీరింగ్ విభాగం వైస్‌ప్రెసిడెంట్ కృష్ణమోహన్ వీరవల్లి, ఎమ్మెల్సీ కవితతో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రూరల్, బోధన్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్ పాల్గొన్నారు. కవిత విజ్ఞప్తిపై ఆ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పదించారు. నిజామాబాద్ ఐటీ హబ్‌పై సుదీర్ఘంగా చర్చించారు. అక్కడి రవాణా, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలతో పాటు శాంతిభద్రతపై కంపెనీ ప్రతినిధులకు కవిత వివరించారు.
రవాణా సౌకర్యం విషయంలో ఆర్టీసీ బస్సులను ఐటీ హబ్ వరకు వేయించడానికి కృషి చేస్తానని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో తాము కల్పించే ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో కంపెనీని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. మంగళవారం కంపెనీ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్‌ను సందర్శించనున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ లాజిల్ సంస్థకు హైదరాబాద్‌లో రెండు క్యాంపస్‌లు ఉన్నాయి. గచ్చీబౌలి, జూబ్లీహిల్స్‌లో వారి కంపెనీలో ప్రస్తుతం దాదాపు మూడు వేల మంది పని చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం: కవిత
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఐటీ హబ్‌లో కంపెనీని ఏర్పాటు చేయాలని తాను చేసిన విజ్ఞప్తికి గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందన్నారు. యువతకు స్థానికంగానే ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్ని జిల్లాల్లో ఐటీ హబ్‌లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసి అమలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ దార్శనికతకు ఇదే నిదర్శనమని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. ఐటీ హబ్‌లో ఏర్పాటు చేయబోయే కంపెనీలకు అన్ని సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భవిష్యత్తులో నిజామాబాద్‌లో మరిన్ని కంపెనీలు ఏర్పాటవుతాయని ఆమె పేర్కొన్నారు. స్థానిక యువత అవకాశాలను ఉపయోగించుకోవాలని కవిత కోరారు. సమావేశంలో బీఆర్ఎస్, ఎన్ఆర్ఐ సెల్గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల పాల్గొన్నారు.