ఖలీల్‌వాడి, జూన్ 7: గులాబీ కండువా కప్పుకుంటే తెలంగాణ ప్రజలకు గులాముల్లా పనిచేయాలని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందేలా చూడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబం, కేసీఆర్ మనస్సు.. చాలా పెద్దవని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్ విజయలక్ష్మి గార్డెన్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులనుద్దేశించి ప్రసంగించారు. కొన్ని రాజకీయ పార్టీలు నినాదాలు చెప్పడమే తప్ప..ప్రజలకు నిజాలు చెప్పవని విమర్శించారు.
కాషాయ కండువా కప్పుకున్న వాళ్లు జై జవాన్… జై కిసాన్ అని ఒర్రడమే తప్ప.. వారికి చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. అమరులైన జవాన్ల కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదుకున్నారని స్పష్టంచేశారు. నిజమైన దేశ భక్తుడు ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆరేనన్నారు. గత ఐదేండ్లలో రాష్ట్రంలోని 65లక్షల రైతులకు రూ.65 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. కేవలం నినాదాలకే పరిమితమైన పార్టీలను వదిలిపెట్టి అందరూ బీఆర్ఎస్లోకి వస్తున్నారన్నారు. బీఆర్ఎస్ మహాసముద్రమని, నదులు, ఉపనదులు, పిల్లకాలువలు చివరికి సముద్రంలో కలిసిన మాదిరే అన్ని పార్టీల వాళ్లు వచ్చి గులాబీ కండువా కప్పుకోవాలే తప్ప నిజామాబాద్‌లో వేరే పరిస్థితి లేదన్నారు. కేవలం ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పేద ప్రజల గురించి ఆలోచన చేస్తున్నదన్నారు. గర్భిణుల కోసం కేసీఆర్ కిట్ పథకం తీసుకొచ్చారని, ఇప్పుడు 66 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరుగుతున్నాయని వివరించారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అద్భుతంగా పని చేస్తున్నారని కవిత ప్రశంసించారు. ఆయన చేస్తున్న మంచి పనులను చూసి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరేందుకు ముందుకొస్తున్నారన్నారు. మల్లేశ్ అనే ఒక నాయకుడు పార్టీలో చేరడంతో బీజేపీ వాళ్లు జలక్ తిన్నారని తెలిపారు. మల్లేశ్ బీఆర్ఎస్లో చేరితే.. ఇంత ఇచ్చారు, అంత ఇచ్చారని వాట్సాప్‌లో దుష్ప్రచారం చేశారన్నారు. నాయకులంటే సంతలో గొర్రెల్లా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆ సంస్కృతి బీఆర్ఎస్ పార్టీలో లేదని, ఈ విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గుర్తు పెట్టుకోవాలని హితవుపలికారు. ఇతర పార్టీలు సామాజిక మాధ్యమాల్లో అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, ప్రతిపక్షాలు ఒక అబద్ధం చెబితే మనం 100 నిజాలు చెప్పిగట్టిగా కౌంటర్ ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డివిజన్ల వారీగా సోషల్ మీడియా సెల్‌ను ఏర్పాటు చేయాలని మార్గనిర్దేశం చేశారు. నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఛానల్‌ను సబ్‌స్ర్కైబ్ చేయాలన్నారు.
Nizamabad
చిన్నచిన్న సమస్యలతో ఎవరికైనా.. ఏ పథకమైనా అందకపోతే బీఆర్ఎస్ నాయకులు అధికారులను కలిసి పరిష్కరించాలి. ప్రజల కోసం ఎంత ఎక్కువ పని చేస్తే గులాబీ కండువాకు అంత ఎక్కువ గౌరవం పెరుగుతుంది. గులాబీ కండువా చూడగానే ప్రజల కండ్లు ఆనందంగా మెరవాలి.
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఉద్యమంలా అభివృద్ధి..: ఎమ్మెల్యే గణేశ్ గుప్తా
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలో చేసిన ఉద్యమం తరహాలో ప్రస్తుతం అభివృద్ధి జరుగుతున్నదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించారని, ప్రభుత్వ దవాఖానలో సాధారణ ప్రసవాలు చేస్తూ దేశంలో ఆదర్శంగా నిలిచామన్నారు. గురుకుల పాఠశాలల ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తున్నట్లు చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, బీడీ కార్మికులకు పింఛన్లు అందిస్తూ ఆసరా కల్పించి భరోసా ఇస్తున్నారని గుర్తుచేశారు. 60ఏండ్లలో జరగని అభివృద్ధి.. తొమ్మిదేండ్లలో నిజామాబాద్‌లో చేశామన్నారు.
25 కిలోమీటర్ల మేర సెంటర్ మీడియన్లు నిర్మించామని, వర్ని రోడ్డు, ఆర్మూర్ రోడ్డు, బోధన్ రోడ్లను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. రూ.25 లక్షలతో కోటగల్లీలో మార్కండేయ మందిరం, రూ.50లక్షలతో హమాల్‌వాడీ సాయిబాబా, సంతోషీమాత ఆలయం పునఃనిర్మాణం, అయ్యప్ప స్వామి, విఠలేశ్వర ఆలయానికి నిధులు మంజూరు చేశామన్నారు. రూ.50లక్షలతో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. అన్ని కులాలు, మతాలకు చెందిన వారు కలిసి ఉండాలని, అందరూ అభివృద్ధి చెందాలనేదే నా అభిమతమని, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. నగర మేయర్ దండు నీతూకిరణ్, శేఖర్, రాష్ట్ర ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్పరాజు, ఎనుగందుల మురళి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, కార్పొరేటర్లు శ్రీనివాస్ ఉమారాణి, మల్లేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.