యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఎన్ఎస్యూఐ నాయకులు ధ్వంస రచనకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితోపాటు పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు.
ఖలీల్‌వాడి, జనవరి 11 : యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. సీఎం ప్రోద్బలంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకులు ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడడం దుర్మార్గమని పేర్కొన్నారు. భౌతిక దాడులతో గులాబీ సైనికులను భయపెట్టలేరని స్పష్టంచేశారు. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
కాంగ్రెస్ పార్టీ తన యువజన విభాగాన్ని గూండాల విభాగంగా తీర్చిదిద్దుతున్నదని మండిపడ్డారు.యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ జరిపిన దాడి, వారి అసలు రంగును బట్టబయలు చేసిందని, కాంగ్రెస్ విష సంస్కృతికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి సిగ్గుమాలిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.