భీమ్‌గల్, నవంబర్ 15: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట జాతర సందర్భంగా పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ కాలేదని, ఈసారి మాత్రం ట్రాఫిక్‌ను నియంత్రించడంలో విఫలమయ్యారన్నారు. లక్షలాది భక్తుల ఇంటి దైవమైన లింబాద్రి గుట్టపై కొలువైన లక్ష్మీనర్సింహాస్వామిని తాను దర్శించుకోకుండా కుట్ర పన్నారన్నారు. ఎవరి పైశాచిక ఆనందం కోసం పోలీసులు పని చేస్తున్నారని మండిపడ్డారు.
శుక్రవారం నింబాచల క్షేత్రంలో జరిగిన లక్ష్మీనర్సింహా స్వామి రథోత్సవంలో పాల్గొన్న వేముల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి ఆయనను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బాల్కొండ నియజకవర్గ ప్రజలపై స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుడ్ని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తుడిగా, ఎమ్మెల్యేగా గత పదేండ్లుగా లింబాద్రి గుట్ట జాతరకు వస్తున్నానని, ఏటా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి గుట్టపై ట్రాఫిక్ జామ్ కాకుండా చూసే వారన్నారు.
గతంలో ఎన్నుడూ లేనట్లు ఈసారి మాత్రం కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయిందన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు వైఫల్యం చెందారని మండిపడ్డారు. తానే రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లానంటే, సామాన్య భక్తుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. కోట్లాది రూపాయలు తెచ్చి లింబాద్రిగుట్టను అభివృద్ధి చేసిన తనకే స్వామి వారి దర్శనం కాకుండా చేశారని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే అయిన తాను దర్శనానికి వస్తుంటే ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాల్సిన పోలీసులు.. కుట్రపూరితంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఒకప్పుడు సింగిల్ రోడ్‌గా ఉన్న భీమ్‌గల్-లింబాద్రి గుట్ట రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చానని, అలాగే గుట్టకు వెళ్లేదారిని నాలుగు లైన్లుగా మార్చామని చెప్పారు. అలాంటి రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడం హాస్యాస్పదమన్నారు. ఎవరి మెప్పు పొందడానికి పోలీసులు పని చేస్తున్నారని ప్రశ్నించారు. బాధ్యులైన పోలీసులపై విచారణ చేపట్టాలని ఏసీపీని కోరారు. దీనిపై సీపీ, కలెక్టర్, డీజీపీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని చెప్పారు.