మోర్తాడ్, డిసెంబర్ 28: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నందున చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల ద్వారా మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లోని చెరువులు నింపాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నీటిపారుదలశాఖ అధికారులకు సూచించారు. కమ్మర్పల్లి మండలంలో శనివారం పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేను కలిసిన బషీరాబాద్ రైతులు.. ఎత్తిపోతల పథకం ద్వారా కాడి చెరువును నింపాలని విజ్ఞప్తి చేశారు.
స్పందించిన వేముల.. అక్కడి నుంచే నీటిపారుదల శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతలను వెంటనే ప్రారంభించి మోర్తాడ్ ముసలమ్మ చెరువులోకి నీళ్లు నింపుతూ, సమాంతరంగా అక్కడి నుంచి బషీరాబాద్ కాడి చెరువులోకి నీళ్లు తరలించాలని సూచించారు. ముసలమ్మ చెరువు పంపుహౌస్ మోటర్లు స్టార్టు చేసి కాడి చెరువు నింపాలన్నారు.
భిక్కనూర్ గురుకుల కళాశాలలో చదువుతూ ప్రమాదవశాత్తు కాలేజీ బిల్డింగ్ పైనుంచి పడి రెండు కాళ్లు విరిగిపోయిన విద్యార్థి రిశ్విత్కు ప్రభుత్వమే పూర్తిస్థాయి చికిత్స అందించాలని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మోర్తాడ్‌కు చెందిన విద్యార్థిని ఆయన నివాసంలో శనివారం వేముల పరామర్శించారు. సొంత డబ్బులు పెట్టి చికిత్స తీసుకున్నామని బాధిత కుటుంబ సభ్యులు చెప్పడంతో ప్రశాంత్‌రెడ్డి కలెక్టర్, డీఎంహెచ్‌వోకు ఫోన్ చేసి రిశ్విత్కు ప్రభుత్వమే చికిత్స అందేలా దగ్గరుండి చూసుకోవాలని కోరారు. విద్యార్థికి రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, సొసైటీ చైర్మన్ కల్లెం అశోక్, పర్స దేవన్న నాయకులు పాల్గొన్నారు.