మోర్తాడ్, సెప్టెంబర్1: జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గడిచిన నాలుగేండ్లుగా బాల్కొండ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసినందున గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.
భారీ వర్షాలకు మొదటగా ఇబ్బంది పడే ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. పాత ఇండ్లు, భవనాలు ఉంటే ప్రజలకు అవగాహన కల్పించి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్సారెస్పీ పూర్తిగా నిండి వరదను గోదావరిలోకి వదిలే పరిస్థితి తలెత్తితే గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండి అవసరం ఉన్నచోట ప్రజలకు సహాయం చేయాలని వేముల పిలుపునిచ్చారు.