భీమ్‌గల్, జూలై 21: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని బెజ్జోరాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడిని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఖండించారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రశ్నించినందుకు హత్యాయత్నానికి పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కండ్ల ముందు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుంటే ఒక బాధ్యత గల పౌరుడిగా బీఆర్ఎస్ కార్యకర్త మహేందర్ ప్రశ్నించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడం, అతడిని చంపాలని చూడడమేనా ప్రజాపాలనా అని ప్రశ్నించారు.
రోజురోజుకూ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పెరుగుతున్నాయని, ఇష్టారీతిన ఇసుక అక్రమ రవాణా దందా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, అక్రమ సంపాదనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు జేబులు నింపుకొంటున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు ఇసుక మాఫియాతో చేతులు కలిపి డబ్బులు పంచుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. దాడి చేసిన వారిని చట్టప్రకారం హత్యాయత్నం కింద రిమాండ్ తరలించాలని, లేకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలు చేసే కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తామని, వెంటాడుతామని, ప్రజాకోర్టులో నిలబెడుతామని పేర్కొన్నారు. ప్రశ్నించిన తమ పార్టీ కార్యర్తలపై అధికార మదంతో దాడులు చేస్తే అదే రీతిలో సమాధానం చెబుతామని వేముల హెచ్చరించారు.