బోధన్, నవంబర్ 16: గ్రామాల వారీగా ఎన్నికల ప్రచారాన్ని బోధన్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ గురువారం ప్రారంభించారు. సెంటిమెంట్ ప్రకారం ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే బోధన్ మండ లం బర్దీపూర్ గ్రామం నుంచే ఈ సారి కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా షకీల్ ఇప్పటి వరకు మండల కేంద్రాల్లో రోడ్ షోలు, ఆత్మీయ సమ్మేళనాలు, పార్టీ కార్యకర్తల సమావేశాలు, బీఆర్ఎస్లో చేరికల కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. కాగా, గురువారం నుంచి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని షెడ్యూల్లో రూపొందించారు.
బర్దీపూర్లో ఎన్నికల ప్రచారం ప్రారంభం సందర్భంగా ఆ గ్రామంలోని వీరాంజనేయస్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే షకీల్ పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బోధన్, సాలూరా మండలాల అధ్యక్షులు సంజీవ్ కుమార్, గోగినేని నర్సయ్య, డీసీసీబీ డైరెక్టర్లు గిర్దావర్ గంగారెడ్డి, గింజుపల్లి శరత్, బీఆర్ఎస్ నాయకులు బుద్దె రాజేశ్వర్, ఎంఏ రజాక్, సాలూరా షకీల్, సిర్ప సుదర్శన్, మేడి రవి, రామయ్య, బోధన్ వైస్ ఎంపీపీ కోట గంగారెడ్డి, సర్పంచులు సాయా రెడ్డి, గుండారం శంకర్, పవన్, బెజ్జం వెంకట్ రెడ్డి, ఆయా గ్రామాల ప్రజలు, రైతులు పాల్గొన్నారు.