ఆర్మూర్ : పసుపుబోర్డు తేకుండా రైతులను ముంచిన ఎంపీ అరవింద్ (MP Aravind) ను రాబోయే ఎన్నికల్లో వెంటబడి ఓడిస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి (Mla Jeevan Reddy ) అన్నారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన వారిని ప్రజలే తగిన బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నారాయణ గౌడ్ తో పాటు ఆ గ్రామంలోని బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు శనివారం బీఆర్ఎస్ (BRS) లో చేరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు, ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR) సమర్థవంత పాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో తామంత చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నాయకులకు అభివృద్ధి అంటే గిట్టదని ఆరోపించారు.ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వక్రనీతని దుయ్యబట్టారు.
నియోజకవర్గంలో అభివృద్ధి జరగని ఊరులేదు, సంక్షేమ సంబురాలు జరగని ఇల్లు లేదని పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతులకు వరమని అన్నారు. రుణమాఫీతో అన్నదాతల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. ఎకరానికి పది వేల చొప్పున రైతు బంధు పెట్టుబడి ఇస్తున్నాం. రైతుబీమాతో విషాదంలో ఉన్న కుటుంబాలను ఆదుకుంటున్నాం. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని వెల్లడించారు.
పల్లె ప్రగతి ద్వారా పల్లెలన్నీ ప్రకృతి వనాలు, నర్సరీలు, సీసీ రోడ్లు, సకల సౌకర్యాలతో వైకుంఠ దామాలు, చెత్తను తొలగించే ట్రాక్టర్లు, పరిసరాల పరిశుభ్రత, మనఊరు-మన బడి ద్వారా పాఠశాలల అభివృద్ధి వంటి పనులతో కళకళ లాడుతున్నాయని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కళ్లు ఉండి చూడలేని కబోదులని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం, దాచుకోవడం కాంగ్రెస్ కు తెలిసిన ఏకైక విద్యని విమర్శించారు.