ఆర్మూర్ : అందరికీ అన్నం పెట్టే రైతులు అన్నదాతలైతే పునః జీవితం ప్రసాదించే వైద్యులు ప్రాణదాతలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (Armoor Mla Jeevan reddy) అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్స్ సమీపంలో ఆర్మూర్ డాక్టర్ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
సృష్టి బ్రహ్మది, ప్రతి సృష్టి వైద్యులదన్నారు. వైద్యో నారాయణో హరిః అని వైద్యులను దేవుళ్ళతో సమానంగా కొలిచే సంస్కృతి మనదన్నారు. మానవాళిని రక్షించే కనురెప్పలు డాక్టర్లు అని కొనియాడారు. ఆర్మూర్ డాక్టర్ల కుటుంబాల కోసం 17 వందల గజాలలో భవనం నిర్మిస్తున్నామని, దీనికోసం త్వరలోనే మరో ఎకరం భూమి కూడా కేటాయిస్తామని వెల్లడించారు.
బిల్డింగ్ నిర్మాణానికి కోసం రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. భవనంలో ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయన్నారు. ఆర్మూర్ పట్టణాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని వెల్లడించారు. ఆర్మూర్‌కు వందపడకల ఆసుపత్రి సాధించి ప్రతీ ఒక్కరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు మళ్లీ తనను ఆశ్వీరదించాలని కోరారు.