కామారెడ్డి (నమస్తే తెలంగాణ)/పెద్దకొడప్గల్, ఆగస్టు 21 : గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా సీఎం కేసీఆర్ అన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలను ఏర్పాటు చేసి, పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో జూనియర్ కళాశాలలు, పీజీ కళాశాల ఏర్పాటు కోసం సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పెద్ద కొడప్గల్ మండలకేంద్రంలో మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా రూ.1.86 కోట్లతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే హన్మంత్ షిండే జుక్కల్ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. పెద్దకొడప్గల్లో జూనియర్ కళాశాల, డోంగ్లీలో జూనియర్ కళాశాల, బిచ్కుందలో పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారని, ఈ మేరకు సీఎంతో మాట్లాడి త్వరలో మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు.
మద్నూర్ మండలం హండెకేలూర్లో మరాఠీ మీడియంను తెలుగు మీడియంగా మార్చాలని కోరారని, త్వరలో మార్చుతామని అన్నారు. పెద్ద కొడప్గల్ జిల్లా పరిషత్ హైస్కూల్‌కు ప్లే గ్రౌండ్, ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. మరో నాలుగు అదనపు గదులు, పాఠశాల గ్రౌండ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. మన పాఠశాలను బాగు చేసుకోవడం, పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. మనఊరు-మనబడి కార్యక్రమం కింద రాష్ట్రంలోని 2,600 స్కూళ్లను రూ. 7వేల కోట్లతో అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. కామారెడ్డి జిల్లాకు రూ. 165 కోట్లు కేటాయించామని తెలిపారు. మధ్యాహ్న భోజనంతోపాటు విద్యార్థులకు వారంలో మూడు రోజులు రాగిజావను బ్రేక్‌ఫాస్ట్‌గా అందిస్తున్నామని చెప్పారు. టాలెంట్ ఎవరి సొత్తు కాదని, విద్యార్థులు బాగా చదువుకొని గొప్పగా ఎదగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తున్నదని తెలిపారు.
2014-15 ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖకు కేవలం 9వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, నేడు రూ.29వేల కోట్లకు పెరిగిందన్నారు. రాష్ట్రంలో 1,571 గురుకులాలను అప్‌గ్రేడ్ చేశామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో రైతులు, మహిళలు, చిన్నారులు అందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. గత 60 ఏండ్లుగా విద్యావ్యవస్థ అభివృద్ధికి నోచుకోలేదని, పట్టణ ప్రాంతాల్లో ఒక విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఒక విధంగా విద్య ఉండేదని అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. పలు మండలాల్లో జూనియర్ కళాశాలలను మంజూరు చేయాలని కోరారు.
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఎంపీ బీబీపాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభతో కలిసి కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి ముందుగా సరస్వతీ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి, మనఊరు-మనబడి చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, అడిషనల్ కలెక్టర్ మను చౌదరి, డీఈవో రాజు, ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, జడ్పీటీసీ చంద్రభాగ, సర్పంచ్ తిర్మల్‌రెడ్డి, హెచ్ఎం చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.