నిజామాబాద్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) / నిజాంసాగర్: ధరణి ద్వారా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో మిగిలిన రెవెన్యూ సమస్యల పరిష్కారానికి త్వరలోనే రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. గ్రామానికే రెవెన్యూ యంత్రాంగం వచ్చి సమస్యను పరిష్కరిస్తుందని తెలిపారు. కొంత మంది అజ్ఞానులు, మూర్ఖులే ధరణిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ధరణి ద్వారా అవినీతి తగ్గి పారదర్శకత పెరిగిందన్నారు.
జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం మండల కేంద్రంలో రూ.10.70కోట్లతో 30 పడకల దవాఖానకు శంకుస్థాపన, బిచ్కుందలో డయాలసిస్ కేంద్రం, మద్నూర్ మండలం నుంచి కొత్తగా ఏర్పాటైన డోంగ్లీ మండలాన్ని స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, దఫేదార్ రాజుతో కలిసి శనివారం ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజలనుద్దేశించి మంత్రి హరీశ్ రావు ప్రసంగించారు.
పట్టా పాసుపుస్తకాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయిందని, రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన పరిపాలనకు నాంది పలికిందన్నారు. ధరణిని అమలు చేసేందుకు అనేక రాష్ర్టాలు మన వైపు చూస్తున్నాయని చెప్పారు. గుక్కెడు మంచి నీళ్లు లేని జుక్కల్ ప్రాంతంలో సైకిల్ పార్టీ పోయి చేయి పార్టీ, చేయి పార్టీ పోయి సైకిల్ పార్టీ వచ్చినా మార్పు రాలేదన్నారు. కారు పార్టీతోనే మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా వచ్చిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నకలు కొట్టి హర్ ఘర్ జల్ పేరుతో పక్క రాష్ర్టాల్లో నల్లాలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నదని ఎద్దేవా చేశారు.
బీజేపీది డబుల్ కాదు.. ట్రబుల్ ఇంజిన్..
బీజేపీ తీరుపై రాష్ట్ర మంత్రి తనదైన శైలిలో విసుర్లు విసిరారు. ఆయా చోట్ల ప్రసంగించిన సందర్భంలో డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ చెప్పుకునే బీజేపీది ట్రబుల్ ఇంజిన్ మోడల్ అంటూ పూసగుచ్చినట్లు వివరించారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ అక్కడ అనేక మంది తెలంగాణలో తమను కలపాలంటూ ర్యాలీలు చేస్తున్నారని గుర్తుచేశారు. కేంద్రంలో, మహారాష్ట్రలో బీజేపీ పాలన నడుస్తున్నప్పటికీ కేసీఆర్ పరిపాలనను మెచ్చుకుంటుండడం గొప్ప విషయమని చెప్పారు. నాందెడ్ జిల్లాలో బాసర పక్కనున్న సర్పంచులు వచ్చి మంత్రి ఐకే రెడ్డిని కలిసి కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ మాకు లేదు. రోడ్లు బాగో లేవు.
మమ్మల్ని తెలంగాణలో కలపాలని దరఖాస్తు చేసిండ్రు… అంటూ గుర్తు చేశారు. అక్కడున్నది డబుల్ ఇంజిన్ సర్కారే అయితే.. అంతా మంచిగుంటే మహారాష్ట్ర సర్పంచులు వచ్చి తెలంగాణలో కలపాలని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. మనది మంచిగున్నది కాబట్టే కలుపుకోవాలని కోరుతున్నారని, ఇది మన పనితనానికి గుర్తింపు అంటూ వివరించారు. ఉచిత కరెంట్, రైతుబంధు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి ఇస్తలేమా? మహారాష్ట్రలో ఇలాంటి స్కీమ్ లేదు.. బండి సంజయ్‌ను అడుగుతున్నా.. అన్నీ ఇస్తున్న పార్టీని ఇష్టమొచ్చినట్లు అంటవా? మేము ఏం చేస్తున్నమో ప్రజలను అడుగు చెబుతారంటూ హితవు పలికారు. ఊర్లో అయ్యా, అవ్వను అడుగు కేసీఆర్ ఏం చేస్తుండో చెబుతారంటూ చురకలంటించారు.
కామారెడ్డికి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్..
రాష్ట్రంలో అత్యధికంగా ఎనీమియా ప్రభావం ఉన్న 9 జిల్లాలైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రుంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ను వారం రోజుల్లోనే ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. మొత్తం 1.24లక్షల మంది ఇందుకోసం నమోదైనట్లు చెప్పారు. ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్లను పోషకాహారం ద్వారా అందించి రక్తహీనత తగ్గించడం, హిమోగ్లోబిన్ శాతం పెంచడమే లక్ష్యమన్నారు. డయాలసిస్ కేంద్రాల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం 3 నుంచి 83కు పెంచిందన్నారు. 102కు పెంచాలన్న లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నట్లు వెల్లడించారు. వారం రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 2014 అనంతర కాలం నుంచి డయాలసిస్ సెషన్స్ 50లక్షలకు చేరబోతున్నదని మంత్రి తెలిపారు. దేశంలోనే ఇది ఒక గొప్ప విషయమన్నారు.
డోంగ్ల్లీ ఒక్కటి చాలదా?
జుక్కల్ నియోజకవర్గం గడిచిన ఎనిమిదేండ్లలో భారీ అభివృద్ధికి నోచుకున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇందుకు డోంగ్ల్లీ ఒక్కటే ఉదాహరణగా వివరించారు. టీఆర్ఎస్ రాక ముందు డోంగ్లీకి రావాలంటే ఆటో రాకపోయేది.. తొవ్వలోనే కాన్పులు అయ్యే పరిస్థితి పోయి నాలుగు దిక్కులు బీటీ రోడ్లు పడ్డదంటే కేసీఆర్ సర్కారు చేసింది కాదా? అన్నారు. సద్ది తిన్న రేవును తలవాలి.. నియ్యత్ ఉంటే బర్కత్ ఉంటదంటూ ప్రజలకు సూచించారు. మహారాష్ట్రలో రైతులు తమ పంటలు కొనాలని పాదయాత్ర చేస్తున్నారన్నారు. అక్కడ పంట కొంటలేరని.. పండిన పంటను తెలంగాణలోనే కొంటున్నామని గుర్తుచేశారు.
తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీలు ఉండగా ప్రస్తుతం 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు అయ్యాయని వెల్లడించారు. జిల్లాలో వైద్య విద్య సేవలు అందించేందుకు 2023-24 నుంచి కామారెడ్డిలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసుకోబోతున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మోటర్లకు మీటర్లు పెడితే సంవత్సరానికి రూ.6వేల కోట్లు చొప్పున 5సంవత్సరాలు పాటు రూ.30వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెబితే అందుకు కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు. గొంతులో ప్రాణం ఉండగా మోటర్లకు మీటర్లు పెట్టనియ్యనని కేసీఆర్ స్పష్టం చేశారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఎఫ్ఆర్బీఎం కింద రాష్ర్టానికి కేంద్రం ఇచ్చే రూ.15వేల కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు సృష్టిస్తున్నప్పటికీ రాష్ట్రంలో సాఫీగా ధాన్యం కొనుగోళ్లను కేసీఆర్ ప్రభుత్వమే చేపడుతున్నదని చెప్పారు.
ప్రధాన సమస్యలు తీరాయి : హన్మంత్ షిండే, ఎమ్మెల్యే
ప్రధాన సమస్యలైన సాగునీరు, రహదారులు, వైద్యశాల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించి ప్రజలను ఆదుకున్నారు. పిట్లం మండలంలో సాగునీరు కోసం రూ.476 కోట్లతో నాగమడుగు లిఫ్టు, పిట్లం-బాన్సువాడ రహదారి, రూ.10.70 కోట్లతో 30 పడకల దవాఖాన నిర్మించడంతో సమస్యలు తీరాయన్నారు. నారాయణఖేడ్ నుంచి పిట్లం మండలానికి మరో మూడు బీటీ రోడ్లను మంజూరు చేయాలని కోరారు.
టీఆర్ఎస్ హయాంలోనే రోడ్లు : బీబీపాటిల్, ఎంపీ
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామానికీ రోడ్లు వేశాం. గ్రామాల్లో మౌలిక వసతులైన తాగు, సాగునీరు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో 161 జాతీయ రహదారిని ఏర్పాటు చేసుకోగలిగాం. రాష్ట్ర సంక్షేమ పథకాలు పేదలకు అండగా నిలిచాయి. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తూ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు.