వినాయక్ నగర్, ఆగస్టు 4 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి అనంతరం తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటి యజమాని అర్ధరాత్రి సమయంలో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి వచ్చేసరికి దొంగతనం జరిగినట్లుగా సంబంధిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు కథనం ప్రకారం.. నిజాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతానికి చెందిన సాయి అనే వ్యక్తి సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి రైల్వే స్టేషన్ వద్ద టీ తాగేందుకు వెళ్లాడు.
తిరిగి గంట తర్వాత ఒకటింటికి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి, ఇంట్లోని వస్తువులన్నీ చిందరమందరంగా ఉండడంతో రెండు గంటల సమయంలో తనకు ఫోన్ చేశాడు. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా మూడు తులాల బంగారం దొంగతనం జరిగినట్లు బాధితుడు వెల్లడించాడు. ఘటనా స్థలాన్ని నగర సీఐ శ్రీనివాస్ రాజ్ పరిశీలించి క్లూస్ టీం తో ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నట్లుగా ఎస్ఐ హరిబాబు వెల్లడించారు.