పూడూరు, సెప్టెంబర్ 28 : కాంగ్రెస్ పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు కుటుంబ సభ్యులు తమ భూములను కబ్జాచేశారని బాధిత రైతు వడ్డె ఎల్లయ్య కుమారులు అనంతయ్య, రవి, రామయ్య, వెంకటయ్య ఆవేదన వ్యక్తంచేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మీర్జాపూర్ పంచాయతీ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 20లో 10 ఎకరాల భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు కూతుళ్లు గద్వాల విజయలక్ష్మి 2 ఎకరాలు, కవిత 3 ఎకరాలు, కుమారుడు వెంకటేశ్వర్రావు 5 ఎకరాలు కబ్జా చేశారని సోమవారం వారు మీడియా ఎదుట ఆరోపించారు.
తాము ఈ విషయమై కోర్టులో కేసు వేశామని, కోర్టులో కేసు ఉండగా తాము ఎలాంటి సాగు చేయకపోయినా రైతు వడ్డే మల్లేశ్‌పై కేసు పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికార పార్టీలో ఉన్నందుకు తమపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సోమవారం రెవెన్యూ అధికారులు భూ పరిశీలనకు రావడంతో కేశవరావు కుమారుడు వచ్చి పోలీసులకు తమపైనే ఫిర్యాదు చే శారని పేర్కొన్నారు. భూమి పేర్లు మారిన అం శంపై అధికారులు పరిశీలించాలని కోరారు. కోర్టు తీర్పు వచ్చే వరకు భూమిలోకి ఎవరూ వెళ్లవద్దని ఎస్సై భరత్‌రెడ్డి తెలిపారు.