సిరికొండ, జనవరి 11 : మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మలావత్ సంగీత అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది. గత సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు సైతం పరిష్కరించకపోవడంతో ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్ అధికారులు గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించడం లేదని సర్పంచులు, ఎంపీటీసీలు ఆరోపించారు. కొండాపూర్ లైన్ ఇన్స్పెక్టర్ ఎవరో తెలియదని, సంవత్సరం గడిచినా ఒక్కసారి గ్రామంలో కనిపించలేదని సర్పంచ్ రమేశ్ సభ దృష్టికి తీసుకువచ్చారు.
చిన్నవాల్గోట్లో ఏడాది గడిచినా మరమ్మతులకు నోచుకోవడం లేదని సర్పంచ్ రాజు, సొసైటీ చైర్మన్ గంగారెడ్డి ఆరోపించారు. ఎంపీపీ సంగీత మాట్లాడుతూ.. పనిచేయని లైన్మెన్లకు మెమోలు జారీ చేయాలని ఏఈలను ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు. మిషన్ భగీరథ నీటిని రోజుకు రెండు సార్లు సరఫరా చేయాలని సర్పంచ్ రమేశ్ కోరారు. పీహెచ్సీలో నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదని సర్పంచ్ ఎన్నం రాజిరెడ్డి ప్రశ్నించారు. పశువైద్యాధికారి ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని ప్రజాప్రతినిధులు ఆరోపించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ తోట రాజన్న, ఏఎంసీ చైర్మన్ గుణ్వీర్రెడ్డి, ఎంపీడీవో లక్ష్మీప్రసాద్, తహసీల్దార్ గఫూర్ మియా తదితరులు పాల్గొన్నారు.