వినాయక్‌నగర్, జూన్ 13: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్‌నగర్‌లో ఉన్న స్వధార్ హోమ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో రిడో అనే స్వచ్ఛంద సంస్థ స్వధార్ హోమ్‌ను నిర్వహిస్తున్నది. వివిధ నేరాలు, ఇతరత్ర సమస్యల్లో బాధితులైన మహిళలను ప్రభుత్వ సంస్థలు, న్యాయస్థానాలు స్వధార్ హోమ్‌కు పంపించి ఇక్కడ రక్షణ కల్పిస్తాయి. కానీ ఇక్కడ హోమ్‌లో మాత్రం సరైన రక్షణ ఏర్పాట్లు లేవని, నిధులను సద్వినియోగం చేయడంలేదనే ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో 2025 జనవరిలో కలెక్టర్ చైర్మన్‌గా, పోలీస్ కమిషనర్, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ, జిల్లా వెల్ఫేర్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్, స్వచ్ఛంద సేవ సంస్థతో మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఫిర్యాదుల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్,అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్‌బీ, స్నేహా సొసైటీ సిద్ధయ్యతో కలిసి శుక్రవారం స్వధార్ హోమ్‌ను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, ప్రభుత్వ అనుమతి లేకుండా రెండేండ్లుగా హోమ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. హోమ్‌లో ఎంత మంది బాధిత మహిళలు ఉన్నారు..ఎంత మంది ప్రవేశం పొందారనే వివరాలు సైతం లేకపోవడంతోపాటు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక నిధుల జమా ఖర్చుల లెక్కల రికార్డులు సైతం సరిగా లేవని, ప్రభుత్వ అనుమతి లేకుండా హోమ్ ఎలా నడుస్తుందని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.