మాక్లూర్, అక్టోబర్ 27 : మండల కేంద్రంలో ఆధునిక హంగులతో నిర్మించిన జడ్పీ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ పాఠశాల భవనాన్ని ప్రభుత్వ నిధులు రూ.4.70 కోట్లు, ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేశ్‌గుప్తా అందించిన రూ.కోటితో అధునాతన హంగులతో నిర్మించగా.. అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేశ్‌గుప్తా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ పిలుపుతో బిగాల గుణేశ్గుప్తా, బిగాల మహేశ్‌గుప్తా ముందుకొచ్చి పాఠశాల భవన నిర్మాణం చేపట్టి, జన్మభూమి రుణం తీర్చుకున్నారని అన్నారు. వారికి విద్య నేర్పిన గురువులకు వందనాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. పుట్టిన ఊరికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం గ్రామస్తుల అదృష్టమన్నారు.
గ్రామంలో తమ తండ్రి పేరుతో ఉన్నత పాఠశాల, తాత పేరుతో ప్రాథమికోన్నత పాఠశాల భవనం నిర్మించడం ఎంతో ఆనందంగా ఉన్నదని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. బిగాల కృష్ణమూర్తి విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. గ్రామానికి సేవ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్‌ను ఒప్పించి పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం తరపున రూ.4.70 కోట్లు మంజూరు చేయించినట్లు గుర్తుచేశారు.
– అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా
తాను అమెరికాలో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్ అక్కడ జరిగిన ఎన్ఆర్ఐల సభలో పాల్గొన్నారని, గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని, ఊర్లను దత్తత తీసుకోవాలని సూచించారని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేశ్‌గుప్తా తెలిపారు. దీంతో తాను గ్రామంలో కోటి రూపాయలతో పాఠశాల నిర్మాణాన్ని చేపడుతానని కేటీఆర్‌కు హామీనిచ్చినట్లు చెప్పారు. కేటీఆర్ స్ఫూర్తితోనే పాఠశాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు.
-ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేశ్‌గుప్తా
బీఆర్ఎస్ హయాంలోనే సీఎం కేసీఆర్ విద్యకు పెద్దపీటవేశారని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం బిగాల సోదరులు కృషి చేస్తున్నారని, బడి, గుడి నిర్మాణాలు చేపడుతూ గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారని అభినందించారు. కేసీఆర్ హయాంలోనే విద్యాభివృద్ధి చెందిందని, సుమారు 10 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి 10 వేల మందిని వైద్యులుగా తీర్చిదిద్దారని తెలిపారు. బిగాల సోదరుల తాత బిగాల గంగారాం వందేండ్ల క్రితమే రైస్‌మిల్ ఏర్పాటు చేసి ఎందరికో అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి అని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి అన్నారు.
– ప్రభుత్వ సలహాదారు పోచారం