కంఠేశ్వర్, మే 3: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియ శుక్రవారం ఆరంభమైంది. వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా, ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. దీంతో 85 ఏండ్ల పైబడిన వయోవృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటిష్ట బందోబస్తుతోపాటు వీడియో చిత్రీకరణ నడుమ హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగుతుందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. ఇంటి నుంచి ఓటు సేకరించే ప్రక్రియను కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చెప్పారు. తొలిరోజు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికల బృందాలు ఆయా రూట్ల వారీగా తమకు నిర్దేశించిన ఓటర్ల ఇళ్లకు వెళ్లి వారి ఓటును సేకరించాయని తెలిపారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా గోప్యతను పాటిస్తూ వీడియో చిత్రీకరణ నడుమ హోమ్ ఓటింగ్ కొనసాగుతున్నదని వివరించారు. హోమ్ ఓటింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముందస్తుగానే తెలియజేయడంతో వారు కూడా పరిశీలిస్తున్నారన్నారు.