నిజామాబాద్, డిసెంబర్ 4, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎక్సైజ్ చట్టం నీరుగారుతోంది. సొంత శాఖ అధికారులే దగ్గరుండి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. చట్ట వ్యతిరేకులతో దగ్గరుండి చట్ట వ్యతిరేక పనులకు తెగబడుతున్నారు. ఇదంతా కళ్ల ముందే జరుగుతున్నప్పటికీ పట్టించుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్లు, డిప్యూటీ కమిషనర్లు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వైన్ షాపులను కొనుగోళ్లు చేసేందుకు అలవాటు పడిన బడా మాఫియా గుప్పిట్లోకి ఉమ్మడి జిల్లా మద్యం దుకాణాలు వెళ్లి పోయాయి.
ఏళ్లుగా ఈ వ్యాపారంలో పాతుకు పోయిన వ్యక్తులే వైన్ షాపులను చేత పట్టుకుని రాజ్యం ఏలుతున్నారు. సిండికేట్ ముఠాతో సత్సంబంధాలు కలిగి ఉన్న ఆబ్కారీ శాఖ అధికారులు నేరుగా సహకరిస్తున్నారు. చట్టానికి తూట్లు పొడిచి యథేచ్ఛగా నిబంధనలను అతిక్రమిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నాలుగైదు దుకాణాలను సిండికేట్ ముఠా అక్రమంగా కొనుగోళ్లు చేసి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ ముఠా కార్యకలాపాలు విచ్చలవిడిగా పెంచుకుంటూ పోయింది. కొత్తగా దుకాణాలు దక్కించుకున్న వారికి నయానో భయానో వెంటపడి లైసెన్సులను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు.
ఆబ్కారీ శాఖ సహకారం..
ఎక్సైజ్ పాలసీ మేరకు లైసెన్సులు దక్కించుకున్న వ్యక్తులు మాత్రమే వైన్స్ దుకాణాలను నడుపుకోవాలి. ఇదంతా కాగితాలకే పరిమితం అవుతోంది. జిల్లా కలెక్టర్ సారథ్యంలో జరిగిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను అపహాస్యం చేసే విధంగా ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్పడుతుండటం విడ్డూరంగా మారింది. పారదర్శకంగా వైన్స్ షాపులు కేటాయింపు జరిగిందంటూ ఓ వైపు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుండగా మరోవైపు చేతులు మారిన మద్యం దుకాణాలతో అడ్డదారిలో వ్యవహారాలు నడుస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో 102 మద్యం దుకాణాలున్నాయి. కామారెడ్డి జిల్లాలో 49 మద్యం దుకాణాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 151 మద్యం దుకాణాలుండగా దాదాపుగా 30 నుంచి 40 దుకాణాలకు సంబంధించిన లైసెన్సు పత్రాలు చేతులు మారాయి. అధికారికంగా లాటరీలో పేరున్న వ్యక్తుల పేరిట మద్యం వ్యాపారం జరుగుతున్నట్లే చూపిస్తుంటారు. తెర వెనుక నిర్వాహకులు వేరే వ్యక్తులు ఉంటున్నారు. నిజామాబాద్ నగరంలో ఆర్మూర్‌కు వెళ్లే దారిలో నెలకొల్పిన పలు వైన్స్ దుకాణాలు పర్మినెంట్ నిర్మాణాలతో తీర్చిదిద్దారు.
ఈ ప్రాంతంలో వేరే చోట మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు అవకాశం లేకుండా పరిస్థితిని కొంత మంది సృష్టించారు. ఈ ప్రాంతంలో కొత్త వారికి మద్యం దుకాణం దక్కితే అనివార్యంగా సిండికేట్గాళ్లకే అప్పనంగా అప్పగించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. లేదంటే ఆబ్కారీ శాఖ అధికారులే రంగంలోకి దిగి వారితో తట్టుకోవడం కష్టమంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. చేసేది లేక ఏక మొత్తంలో డబ్బులు తీసుకుని లైసెన్స్ దారులు పక్కకు జరిగి పోతున్నారు. ఈ తతంగం నడిపించడానికి రూ.కోట్లు చేతులు మారుతున్నట్లుగా తెలుస్తోంది. సంబంధిత శాఖ అధికారులకు ఇందులో భారీగా ప్రయోజనం చేకూరుతోందని ప్రచారం జరుగుతోంది.
సిండికేట్ పెత్తనం…
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గతంలో నకిలీ మద్యం పట్టుబడింది. మహారాష్ట్రకు చెందిన తక్కువ ధరకు లభించే చీప్ లిక్కర్‌ను రూ.వేలు పలికే బాటిళ్లలో కలిపేసి అమ్ముతున్న వైనం బట్టబయలైంది. ప్రీమియం కంపనీలకు చెందిన బాటిళ్ల మూతలను చాకచక్యంగా తొలగించి అందులో నకిలీ మద్యాన్ని నింపిన కేసులో సిండికేట్ వ్యాపారుల హస్తమే ఉంది. లైసెన్సుదారులకు రూ.కోటి వరకు ముట్టజెప్పి వైన్ షాపును చేతుల్లోకి తీసుకుంటున్నారు. పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకునేందుకు అడ్డదారుల్లో వ్యాపా రం చేస్తున్నట్లుగా అనేక ఆరోపణలు వీరిపై ఉన్నాయి. నిరంతర తనిఖీలు, సోదాలు నిర్వహించకపోవడం, ఆబ్కారీ శాఖలో పారదర్శకత లోపించడంతో సిండికేట్ వ్యాపారుల తీరు రోజురోజుకు పెరిగి పోతోంది.
ఎక్సైజ్ శాఖకు చెందిన ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను సైతం తమ గుప్పిట్లో పెట్టుకునేంత స్థాయికి బడా వ్యాపారులు చేరుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్లు నామమాత్రంగా పరిమితం కావడమే వీరికి కలిసి వస్తోంది. రికార్డుల పరిశీలన, స్టాక్ నిర్వాహణపై నియంత్రణ చేయకపోవడం వల్ల అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. మద్యం దుకాణాల నిర్వాహణలో సిండికేట్‌ను నివారించేందుకు లాటరీ పద్ధతిని అవలంభించి దుకాణాలను అర్హులకు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని నీరుగారిస్తున్నారు. కొత్త వారిని ఈ రొంపిలోకి రాకుండా అడ్డుకోవడం, తమ చేతుల్లోనే వ్యాపారం కొనసాగించేలా బడా బాబులు ఏటా వ్యూహాలు అమలు చేస్తున్నారు.