‘నయా’ సాల్ జోష్తో ఇందూరు హోరెత్తింది. నూతన సంవత్సర వేడుకలతో ఉమ్మడి జిల్లాకు కొత్త కళ వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలు దాటగానే హ్యాపీ న్యూఇయర్ అంటూ యువత రోడ్ల మీదకు వచ్చారు. కేకులు కట్చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంబరాన్నంటాయి. మందు, మాంసం, కేక్ విక్రయాలతో మార్కెట్లు కళకళలాడాయి. నూతన సంవత్సరానికి యువత ‘ఫుల్లు’ జోష్తో స్వాగతం పలికింది. దీంతో లిక్కర్ విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి.
కొత్త సంవత్సర వేడుకలేమో గానీ మద్యం వ్యాపారులకు మాత్రం పంట పండింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరిట యువత ఫుల్లుగా లాగించేశారు. నాలుగు రోజుల్లో రూ.46 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. మంగళవారం ఒక్కరోజే రూ.16.50 కోట్ల విలువైన లిక్కర్ బిజినెస్ జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 102, కామారెడ్డిలో 49 వైన్స్షాపులు కలిపి మొత్తం 151 దుకాణాలు ఉన్నాయి. వీటికి మాక్లూర్ మండలంలోని మాదాపూర్ వద్ద ఉన్న ఐఎంఎల్ డిపో నుంచి మద్యం సరఫరా అవుతున్నది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా న్యూఇయర్ సందర్భంగా భారీగా మందు అమ్ముడుపోయింది. ఐఎంఎల్ డిపో నుంచి శని, ఆది, సోమవారాల్లో రూ.30.09 కోట్ల విలువైన 26,700 లిక్కర్ కేసులు, 44 వేల బీర్ కేసులు విక్రయించారు. మంగళవారం ఒక్కరోజే 16.50 కోట్ల విలువైన 14 వేల లిక్కర్, 12 వేల బీర్ కేసులు అమ్ముడుపోయాయి. గతంలో కంటే ఈసారి బీర్లతో పాటు లిక్కర్ విక్రయాలు రెట్టింపు స్థాయిలో జరగడం గమనార్హం.