ఖలీల్‌వాడి, మే 30: స్కానింగ్ ముసుగులో మహి ళల వీడియోలు చిత్రీకరిస్తూ పోలీసులకు చిక్కిన నిందితుడి లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. స్కానింగ్ కోసం వచ్చే మహిళలను టార్గెట్ చేసిన నిందితుడు ప్రశాంత్.. అమాయకులతో ఆడుకున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది మహిళల బలహీనతను ఆసరాగా చేసుకొని స్కానింగ్ పేరిట వారికి ఏవేవో ఆశలు చూపి తన వలలో వేసుకున్నట్లు తెలిసింది. లింగ నిర్ధారణ పేరిట మరికొందరికి స్కానింగ్ చేస్తూ వారి ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు సమాచారం.
కొందరు మహిళలు లింగ నిర్ధారణ చేయడం నేరమని తెలిసినా…ఇంట్లో వేధింపులు తదితర ఇబ్బందుల దృష్ట్యా లింగ నిర్ధారణ చేయించుకుంటున్నారు. ఇదే అదనుగా తీసుకున్న ప్రశాంత్ తమ స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ చేస్తామని ఆశ చూపి.. స్కానింగ్‌కు వచ్చిన మహిళ ఫొటోలు, వీడియోలు తీసి మొబైల్‌కు పంపించేవాడని తెలిసింది. తనకు డబ్బులు ఇవ్వాలని, సన్నిహితంగా ఉండాలని లేకపోతే తాను తీసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడని సమాచారం. దీంతో బాధిత మహిళలు కాళ్ల మీద పడి ప్రాధేయపడేవారు. మరికొందరు డబ్బులు ఇచ్చి తమను ఇబ్బందులకు గురిచేయొద్దని చేతులెత్తి మొక్కారు. అయినా మహిళలను వదలకుండా తీవ్ర మనోవేదనకు గురిచేసే వాడని సమాచారం.
జిల్లాలో ఎన్నో స్కానింగ్ సెంటర్లు ఉన్నా ఈ ఒక్క స్కానింగ్ సెంటర్‌కు ఎక్కువ సంఖ్యలో మహిళలు వస్తుంటారు. ఇందుకు ప్రధాన కారణం యాజమాన్యం అందించే కమీషన్. పెద్ద మొత్తంలో కమీషన్ వస్తుండడంతో ఆర్ఎంపీ నుంచి బడా డాక్టర్ల వరకు మహిళలను ఇక్కడికే రిఫర్ చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఈ స్కానింగ్ సెంటర్లోనే స్కానింగ్ తీసుకోవడం ద్వారా సమస్యను పూర్తిగా విశ్లేషించవచ్చనే భ్రమ కల్పించడంతో చేసేదేమీ లేక ఇక్కడే స్కానింగ్ చేయించుకునేవారని సమాచారం. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో బలహీనత అనుకోవచ్చు. ఇవన్నింటినీ ఆసరాగా చేసుకున్న నిందితుడు ప్రశాంత్.. అమాయక మహిళలకు వేధించినట్లు తెలుస్తున్నది.
దేవుడి పేరుతో నెలకొల్పిన స్కానింగ్ సెంటర్లో మహిళల జీవితాలతో చెలగాటమాడే వీడియోలు, ఫొటోలు తీయడంపై సభ్యసమాజం దుమ్మెత్తి పోస్తున్నది. స్కానింగ్ పేరిట మహిళలను దుస్తులు లేకుం డా చేసి ఫొటోలు, వీడియోలు తీయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. నిందితుడి మొబైల్ డాటా రికవరీతో ఈ తతంగం కొన్నేండ్లుగా సాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదంతా ఒక్కడే ఎలా చేస్తాడని, ఎవరైనా సహకరించి ఉంటారనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు సమాచారం.