నవీపేట, జూలై 18: ఐదు నెలలుగా బకాయి ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవీపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గుత్ప, అలీసాగర్ లిప్టు ఇరిగేషన్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వర్కర్స్ యూనియన్ నాయకుడు గణేశ్ మాట్లాడుతూ జిల్లాలోని గుత్ప, అలీసాగర్ లిప్టు ఇరిగేషన్లో ఎలక్ట్రీషియన్, పంప్‌హౌస్ ఆపరేటర్లు, వాచ్మన్లు, గార్డెన్ క్లీనర్లతో కలుపుకొని 120 మంది కార్మికులు నిత్యం పనిచేస్తున్నారన్నారు.
ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబసభ్యులతో సహా పస్తులుండాల్సిన పరిస్థితి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా తమ సమస్యలను విన్నవించినా ఫలితం లేదని అన్నారు. లిప్టుల కాంట్రాక్టర్ కిశోర్‌రెడ్డికి తమ సమస్యలను వివరించినా పట్టించుకోవడంలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడు రోజుల నుంచి సమ్మె చేపడుతున్నామని పేర్కొన్నారు. అనంతరం ధర్నా చౌక్ నుంచి తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ నారాయణకు వినతిపత్రం అందజేశారు. కార్మిక నాయకులు గణేశ్, కార్తీక్, సందీప్, జగదీశ్, కార్మికులు పాల్గొన్నారు.