Sai Kiran : నిర్మల్ జిల్లా బాసర పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్పూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల రమావత్ సాయికిరణ్ గోదావరి నదిలో పడి చనిపోయాడు. యూకేలో ఎంబీఏ చేస్తున్న అతడు ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 5న తిరిగి యూకే వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో మంగళవారం బాసర ఆలయానికి వెళ్లాడు.
దైవ దర్శనం అనంతరం బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. విషయం తెలుసుకుని కుటుంబసభ్యులు గాలింపు చేపట్టగా బుధవారం అతడి మృతదేహం లభ్యమైంది. తండ్రి రమావత్ భోజారామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పీఎస్లో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.