Ration Rice | రాయపోల్, సెప్టెంబరు 2 : ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకునే ప్రయత్నం మరోసారి వెలుగు చూసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట నుంచి అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఈచర్ వాహనాన్ని టాస్క్‌ఫోర్స్ టీం-5 బుధవారం తెల్లవారుజామున పట్టుకుంది. వాహనాన్ని వెంబడించిన అధికారులు రాయపోల్ మండలం రామారం గ్రామంలోని మహాలక్ష్మి రైస్‌మిల్ వద్ద తనిఖీ చేయగా 120 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడింది. ఇదే మిల్లులో మరో 280 క్వింటాళ్ల వరకు పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించడంతో మొత్తం సుమారు 400 క్వింటాళ్ల రేషన్ బియ్యం వెలుగు చూసింది.
శామీర్‌పేట నుంచి రామారం వరకు..
విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ టీం–5 అధికారులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలంలో పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఈచర్ వాహనాన్ని గుర్తించారు. వెంటనే వాహనాన్ని వెంబడించగా అది సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం గ్రామంలోని మహాలక్ష్మి రైస్‌మిల్ వద్దకు చేరుకుంది. అక్కడ వాహనాన్ని తనిఖీ చేయగా 9 మెట్రిక్ టన్నుల (120 క్వింటాళ్ల) పీడీఎస్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిల్లులోనూ భారీగా నిల్వ.. ఈచర్ వాహనంలో బియ్యాన్ని గుర్తించిన అధికారులు మహాలక్ష్మి రైస్మిల్లోనూ తనిఖీలు నిర్వహించారు. మిల్లులో మరో 280 క్వింటాళ్ల వరకు పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. దీంతో వాహనంలోని 120 క్వింటాళ్లతో కలిపి మొత్తం సుమారు 400 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు వెల్లడైంది.
డ్రైవర్, మిల్లు యజమాని అదుపులో..
పీడీఎస్ బియ్యంతో పట్టుబడిన ఈచర్ వాహనం TS-05-UC-5599తో పాటు డ్రైవర్ మాలోత్ శ్రీకాంత్ (పుట్టగూడెం, రాజాపేట మండలం, యాదాద్రి-భువనగిరి జిల్లా)ను టాస్క్‌ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుంది. మిల్లు యజమాని బచ్చు నాగరాజును కూడా విచారించారు. అనంతరం వాహనం, బియ్యం, డ్రైవర్‌ను స్థానిక పోలీసులకు అప్పగించారు. సంబంధిత డీటీసీఎస్ అధికారులకు సమాచారం అందించి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేయడానికి చర్యలు చేపట్టారు.
ఇదే మిల్లులో గతంలోనూ..
ఇదిలా ఉండగా.. జూలై నెలలో రాయపోల్ మండలం రామారంలోని ఇదే మహాలక్ష్మి రైస్‌మిల్లులో వందలాది బస్తాల్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఈ రైస్‌మిల్లుకు గతంలో ప్రభుత్వం బియ్యం నూర్పిడి కోసం సరఫరా చేసిన సుమారు 30 వేల బస్తాల వడ్లకు సంబంధించిన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించలేదని అధికారులు పేర్కొన్నారు. తాజాగా ఇదే మిల్లులో మరోసారి భారీగా పీడీఎస్ బియ్యం పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.
