ఖలీల్‌వాడి, జనవరి 11 : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని సమష్టి కృషితో విజయవంతం చేద్దామని ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ నారాయణరెడ్డి అధ్యక్షతన కంటి వెలుగు కార్యక్రమంపై బుధవారం జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, ఎమ్మెల్సీ రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్లు తూము పద్మ, వినీత పండిత్, కన్నెగంటి ప్రేమలత, జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ రజితా యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. దేశంలోనే మరెక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వినూత్న ఆలోచనలతో ఎన్నో బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంటి వెలుగు ముఖ్యఉద్దేశం, కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవశ్యకతపై కలెక్టర్ నారాయణరెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
జిల్లాలో 18 ఏండ్లు పైబడిన 12,32,872 మందికి ఈ కార్యక్రమం ద్వారా నేత్ర పరీక్షలు నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలను నిర్వహించేందుకు మొత్తం 70 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో బృందంలో ఎనిమిదిమంది సభ్యులు ఉంటారని, కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అప్పటికప్పుడు ఈ శిబిరాల్లోనే మందులు, కంటి అద్దాలు అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాకు 61,200 కంటి అద్దాలు వచ్చినట్లు తెలిపారు. ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమైన వారి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చనున్నట్లు చెప్పారు. పదిహేను రోజుల్లోపు వారికి కంటి అద్దాలు సమకూరుస్తామన్నారు.
శరరీ అవయవాల్లో అతి ముఖ్యమైనవి నేత్రాలు అయినందున కంటి సమస్యలను ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకుండా 18 ఏండ్లు పైబడిన వారందరూ తప్పనిసరిగా కంటి వెలుగు శిబిరాల్లో నేత్ర పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ఈ దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోనూ విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.
ఆయా గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా రూపొందించిన నిర్ణీత ప్రణాళికను అనుసరిస్తూ కంటి వెలుగు శిబిరాలకు క్రమపద్ధతిలో ప్రజలను తరలించేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. అవగాహన సదస్సులో నోడల్ అధికారి అమర్‌సింగ్‌నాయక్, అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా, జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధికారి డాక్టర్ సుదర్శనం, వివిధ శాఖల అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.