ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 4 : మండలంలోని సోమిర్యాగడి తండాలో మేకల మందపై శనివారం రాత్రి చిరుతపులి దాడి చేసింది. తండాకు చెందిన కేతావత్ భీమ్లాకు చెందిన మేకల మంద శనివారం ఉదయం మేత కోసం అటవీ ప్రాంతానికి వెళ్లింది. వాటి వెంట కావలిగా కుక్కలు వెళ్లాయి. మేకల మంద సాయంత్రానికి గ్రామానికి తిరిగి వస్తుండగా చిరుత మందపై దాడి చేసింది. మందలోని రెండు మేకలతో పాటు వెంట ఉన్న కుక్కను చంపి తినేసింది.
ఇంటికి వచ్చిన మేకల మందను కేతావత్ భీమ్లా పరిశీలించగా రెండు మేకలు, కుక్క కనిపించలేదు. ఆదివారం ఉదయం వాటిని వెతుక్కుంటూ అటవీ ప్రాంతానికి వెళ్తుండగా దారిలో వాటి కళేబరాలు కనిపించాయి. దీంతో పాటు మేకల మందపై దాడి చేసిన పులి ఆనవాళ్ళను భీమ్లా గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులతో పాటు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కళేబరాలను పరిశీలించారు. కాగా 15 సంవత్సరాలుగా దగ్గరలోని అడవుల నుంచి చిరుతలు వస్తూ మేకలను చంపి తింటున్నాయి. దీంతో అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత దాడుల నుంచి తమ జీవాలను రక్షించాలని తండావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.