వినాయక్‌నగర్, నవంబర్ 26 : నగరానికి చెందిన న్యాయవాది ఖాసీంపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేసి, శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం ఆందోళన చేపట్టారు. జిల్లాకేంద్రంలోని కోర్టు చౌరస్తా, ధర్నా చౌక్ వద్ద మానవహారం నిర్మించి, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. నగరంలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోతున్నదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నదన్నారు. గూండా రాజ్యమేలుతున్నదన్నారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టి శాంతిభద్రతలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖాసీంపై దాడి చేసిన దుండగులను అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి న్యాయవాదుల వద్దకు వచ్చి నిందితులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిల్ మెంబర్ రాజేందర్ రెడ్డి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు వసంతరావు, రాజు, సురేశ్, శ్రీకాంత్, అయూబ్, పరుచూరి శ్రీధర్, భాస్కర్, వెంకటేశ్, మాణిక్ రాజు, ఆశ నారాయణ, రవీందర్, జైపాల్, కవితారెడ్డి, అంజలి, కావ్య, అఖిల, ప్రవీణ, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.