మోర్తాడ్, జూన్ 17: బీఆర్ఎస్ రాజ్యసభాపక్ష నేతగా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామానికి చెందిన కేతిరెడ్డి సురేశ్ రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ నియామకపత్రాన్ని సోమవారం సురేశ్‌రెడ్డికి అందజేశారు. కేఆర్ సురేశ్ రెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా కిందిస్థాయి నుంచి పైకి ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా సురేశ్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. నాలుగుసార్లు బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అందులో ఐదేండ్లు స్పీకర్‌గా పనిచేశారు. గత నాలుగేండ్లుగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజ్యసభాపక్షనేతగా ఉన్న కేశవరావు బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోవడంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సురేశ్‌రెడ్డిని నియమిస్తామని గతంలో విలేకరుల సమావేశంలో కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటించిన విధంగానే కేఆర్ సురేశ్‌రెడ్డిని రాజ్యసభపక్ష నేతగా ప్రకటించడంతో బాల్కొండ బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. తనను పార్లమెంటరీ నేతగా ప్రకటించడంపై సంతోషం వ్యక్తంచేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సురేశ్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.