లింగంపేట, జూన్ 18: కుటుంబ కలహాలతో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన మండలంలోని మెంగారం గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకున్నది. ఏఎస్సై ప్రకాశ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బోనాల్ గ్రామానికి చెందిన నీల స్వామికి ఎక్కపల్లి గ్రామానికి చెందిన సునీతతో వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో సునీత తల్లిగారింట్లో ఉంటున్నది. 10రోజుల క్రితం స్వామి.. తల్లి అల్లెవ్వతోపాటు కోమట్‌పల్లి గ్రామంలో ఉంటున్న సోదరి ఈకల బాలమణి ఇంటికి వెళ్లారు. పండుగ అనంతరం కామారెడ్డి రైల్వేస్టేషన్లో స్కావెంజర్‌గా పనిచేస్తున్న అల్లెవ్వ వెళ్లిపోయింది. సోమవారం రాత్రి స్వామి బోనాల్ గ్రామానికి వెళ్తుండగా మెంగారం గ్రామ బస్టాండ్ సమీపంలో ఈకల బాలమణి అల్లుడు నవీన్, బొల్లారం గ్రామానికి చెందిన సుధాకర్ స్వామిపై కత్తితో దాడి చేసి గొంతుకోశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్వామిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు తెలిపారు. తల్లి అల్లెవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.