మోర్తాడ్, అక్టోబర్ 14: కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్న తమకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా అసెంబ్లీలో తమ గురించి ప్రస్తావించాలని బాధితులు.. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు చెందిన బాధితులు వేల్పూర్‌లో సోమవారం ఎమ్మెల్యే వేములను కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిడ్నీ బాధితులమంతా కలిసి ప్రజాభావన్కు వెళ్లి వినతిపత్రం సమర్పించామని, అయినా ఎలాంటి స్పందనలేదని వేముల దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలను కలిసి తమ గోడు వెల్లబోసుకుంటున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోఎంఎస్ 43 ద్వారా కిడ్నీ బాధితులకు ప్రతినెలా రూ.10 వేల పింఛన్ ఇస్తున్నదని, అదే విధంగా తెలంగాణలోనూ ఇవ్వాలని కోరారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన వారు, కిడ్నీ సమస్యలు ఉన్న వారు పని చేసే పరిస్థితి ఉందని, డయాలసిస్ కోసం ప్రతినెలా దవాఖానల చుట్టూ తిరగాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ప్రశాంత్‌రెడ్డి బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.