ఖలీల్‌వాడి, నవంబర్ 24: 2009 నవంబర్ 29న కేసీఆర్ నిరాహార దీక్ష మహోజ్వల ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు. స్వరాష్ట్ర కల సాకారానికి పునాదివేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో దీక్షా దివస్‌ను నిర్వహించనున్నది. ఇందుకోసం పార్టీ అధిష్టానం అన్ని జిల్లాలకు సీనియర్ నాయకులను ఇన్‌చార్జీలుగా నియమించింది.
నిజామాబాద్ జిల్లాకు ఫారూఖ్ హుస్సేన్, కామారెడ్డి జిల్లాకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను నియమించింది. మూడు కోట్ల తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో మా తెలంగాణ మాకు కావాలని నినదించారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని తెగువను ప్రదర్శించిన నాయకుడికి అండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థను కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదిలించిన ఒక సందర్భం దీక్షా దివస్. పెద్ద ఎత్తున నిర్వహించనున్న దీక్షా దివస్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొననున్నారు.