ఖలీల్‌వాడి, డిసెంబర్ 3: ఉమ్మడి జిల్లాలో మంగళవారం తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ జాగృతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్‌లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద శ్రీకాంతాచారి చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జాగృతి నాయకులు మాట్లాడుతూ.. శ్రీకాంతాచారి ప్రాణ త్యాగం యావత్ దేశ ప్రజలను ఉద్యమానికి మేల్కొలిపిందని పేర్కొన్నారు. తన అమరత్వంతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన శ్రీకాంతాచారిని ఈ తెలంగాణ గడ్డ ఎప్పటికీ మరువబోదన్నారు. ఆయన అడుగుజాడల్లో తెలంగాణ జాగృతి ముందుకు వెళ్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు అవంతిరావు, లక్ష్మీనారాయణ భరద్వాజ్, పులి జైపాల్, పంచరెడ్డి మురళి, శ్రీనివాస ఆర్యా, ఘనపురం దేవేందర్, శోభ, సరిత, సంతోష్, శ్రీకాంత్, సందీప్ పాల్గొన్నారు.