మానవాళికి ఆదర్శప్రాయుడు శ్రీ కృష్ణుడు
గీతోపదేశంతో దిశానిర్దేశం
సోమ,మంగళవారాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
సిద్ధమైన శ్రీకృష్ణ మందిరాలు
భగవంతుని దశావతారాలలో పరిపూర్ణమైంది కృష్ణావతారం. కృష్ణుడు ద్వాపరయుగంలో జన్మించాడు. దేవకీవసుదేవుల ముద్దుబిడ్డగా శ్రావణకృష్ణ అష్టమినాడు ఈ మహాపురుషుడు జన్మించడంతో ఆ రోజున కృష్ణ జయంతిని పర్వదినంగా జరుపుకోవడం అనాదిగా ఒక సంప్రదాయమైంది. నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కథనం..
వేడుకలకు ముస్తాబైన శ్రీకృష్ణ మందిరాలు
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి ఉమ్మడి జిల్లాలోని శ్రీకృష్ణ మందిరాలు ముస్తాబయ్యాయి. ఈ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి సోమవారం ప్రారంభమై మంగళవారం వరకు ఉండడంతో గోకులాష్టమి వేడుకలను రెండు రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోకులాష్టమి వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుని జననం రాత్రి పూట కావడంతో ఉట్టి కొట్టే సమయానికి అష్టమి తదియ ఉండాలనే సంప్రదాయంతో భక్తులు సోమవారం రోజున వేడుకలు నిర్వహించనున్నారు. సోమవారం అర్ధరాత్రి శ్రీకృష్ణుని జననంతోపాటు ఊయలలో వేయడం, భజనలు చేయడం తదితర కార్యక్రమాలను శ్రీకృష్ణ మందిరాల్లో నిర్వహించనున్నారు.
శ్రీ కృష్ణుడి జనన వృత్తాంతం..
ఇతిహాస గాథల ప్రకారం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఎనిమిదో అవతారమే కృష్ణావతారం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రావణ బహుళ అష్టమి రోజున అర్ధరాత్రి, రోహిణీ నక్షత్రంలో దేవకీ వసుదేవులకి ఎనిమిదో సంతానంగా, నాలుగు భుజాలతో శ్రీ కృష్ణుడిగా జన్మించినాడు. అనంతరం యశోద వద్ద అల్లారు ముద్దుగా పెరిగాడు. శ్రీకృష్ణుడు పుట్టిన రోజును కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి అని రకరకాలుగా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఏ అవతారానికీ జగద్గురువుగా పిలువబడలేదు. కానీ, శ్రీకృష్ణ అవతరానికి మాత్రం జగద్గురువు అని పిలుస్తారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భగవద్గీతను బోధించి ప్రపంచానికే గురువు అనిపించుకున్నాడు. అందుకే కృష్ణం వందే జగద్గురుమ్ అన్నారు.
శ్రీకృష్ణ వత్రం..
ద్వాపర యుగంలో జన్మించిన శ్రీకృష్ణుడు నేటి కలియుగంలో సైతం ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నాడు. కృష్ణున్ని చాలా మంది కులదైవంగా, ఆరాధ్య దైవంగా పూజిస్తారు. కృష్ణాష్టమి రోజున భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని చేయడం ద్వారా గోదానం చేసినంత ఫలితం దుక్కుతుందని బ్రహ్మాండ పురాణాల్లో పేర్కొన్నారు. కృష్ణాష్టమి రోజున భక్తులు నియమనిష్టలతో ఉపవాస దీక్షలో ఉండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామి వారికి ఇష్టమైన పండ్లు, అటుకులు, పాలు, పెరుగు, వెన్న, మీగడను నైవేద్యంగా సమర్పిస్తారు.
యాదవులు, మథుర లంబాడాలకు ప్రధాన పండుగ..
శ్రీ కృష్ణుడుకి ఎంతో ఇష్టమైన గోవులను సంరక్షించడంతోపాటు వాటిని భక్తిశ్రద్ధలతో పూజించే యాదవులు, మథుర లంబాడాలు గోకులాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మథుర లంబాడా తండాల్లో గోకులాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ.
ప్రధాన ఆకర్షణగా ఉట్టి కొట్టడం..
గోకులాష్టమి వచ్చిందంటే చాలు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా యువతీ యువకులు ఉట్టి కొట్టడానికి పోటీపడతారు. గోకులాష్టమి వేడుకల్లో ప్రధాన ఆకర్షణ ఉట్టి కొట్టే కార్యక్రమం. పల్లెలతోపాటు పట్టణాల్లో పండుగను పురస్కరించుకొని ప్రధాన కూడళ్ల వద్ద ఎత్తుగా ఉట్టిని కడుతారు. ఈ ఉట్టిని పగులగొట్టిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందజేస్తారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
శ్రావణ బహుళ అష్టమి పురస్కరించుకొని రెండు రోజులపాటు గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు శ్రీకృష్ణ ధ్యాన మందిరంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం.
ఆకులకొండూర్లో కృష్ణాష్టమి వేడుకలు
నిజామాబాద్ రూరల్, ఆగస్టు 29: నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని ఆకుల కొండూర్‌లో ఆదివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులను శ్రీకృష్ణుడు, సత్యభామ, గోపికల వేషధారణలో అలంకరించారు. గ్రామ ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన ఉట్టిని పగులగొట్టేందుకు యువకులు పోటీపడ్డారు. కార్యక్రమంలో సర్పంచ్ అశోక్, ఎంపీటీసీ సుధీర్‌కుమార్, గ్రామపెద్దలు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.