టీయూలోకి మరో మూడు జిల్లాలు
నిర్మల్, ఆదిలాబాద్‌తో పాటు మెదక్
త్వరలోనే అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి
సర్కారుకు నివేదిక అందించిన ఉన్నత విద్యామండలి
నేడో రేపో నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ యూరివర్సిటీ పరిధి మరింత పెరగనున్నది. చాలా ఏండ్లుగా పాత ఆదిలాబాద్ జిల్లాను టీయూ పరిధిలోకి తీసుకువస్తారనే చర్చలు సాగాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వం ముందు ఉంచింది. దీంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ అఫిలియేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తి కానున్నట్లు సమాచారం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పది జిల్లాలు ఉండగా 33కు పెంచింది. వీటి ఆధారంగా రాష్ట్రంలోని ప్రధాన యూనివర్సిటీల కింద ఉన్న జిల్లాలకు దూరభారం తగ్గించేందుకు వర్సిటీ పరిధిని మార్చాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ల కమిటీ అన్ని జిల్లాలను దృష్టిలో ఉంచుకుని నివేదికను రూపొందించింది. ప్రొఫెసర్ పాపిరెడ్డి నేతృత్వంలోని ఉన్నత విద్యామండలి ప్రొఫెసర్ల కమిటీ ఈ నివేదికకు తుది రూపమిచ్చి ఇటీవలే సర్కారు చెంతకు చేర్చింది. ఈ నివేదికలో తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోకి కొత్తగా నిర్మల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలను చేర్చింది. దీనిపై త్వరలోనే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.
డిచ్పల్లి, ఆగస్టు 22: తెలంగాణ రాష్ట్రం పేరు మీదుగా ఏర్పడిన తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధి మరింత పెరగనున్నది. చాలా ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఈ అఫిలియేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తి కానున్నట్లు తెలిసింది. ఎప్పటి నుంచో పాత ఆదిలాబాద్ జిల్లాను టీయూ పరిధిలోకి తీసుకురానున్నట్లు చర్చలు సాగాయి. ఎందుకో ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రస్తుతం అందుకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వ చెంతకు చేర్చింది. తెలంగాణ విశ్వవిద్యాలయంతోపాటు కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ, వరంగల్‌లోని కాకతీయ వర్సిటీల పరిధిని కూడా మార్చినట్లు ఉన్నత విద్యామండలి తన నివేదికలో పొందుపర్చింది. ఈ నివేదికలో ప్రస్తుత నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు మెదక్ జిల్లాను కూడా చేర్చుతూ పొందుపర్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రక్రియకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అదే జరిగితే ఆరు కోర్సులతో ఆరంభమైన తెలంగాణ వర్సిటీ పరిధి ఇప్పటి వరకు పాత నిజామాబాద్ జిల్లాకే పరిమితం అయి ఉండేది. దీనికి తోడు ఇప్పుడు మాత్రం మరో మూడు జిల్లాలు కూడా చేరాయి.
ప్రొఫెసర్ల నివేదికే ప్రమాణికం..
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధానంగా ఉస్మానియాతోపాటు కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మా గాంధీ, పాలమూరు యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. మొదట ఉన్న పది జిల్లాల నుంచి వాటి విస్తీర్ణం తగ్గిస్తూ 33 జిల్లాలను ఏర్పాటు చేసింది. వీటి ఆధారంగా రాష్ట్రంలోని ప్రధాన యూనివర్సిటీల కింద ఉన్న జిల్లాలను వాటికి దూరభారం తగ్గించేందుకు వర్సిటీ పరిధిని మార్చాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. అదే తడువుగా అన్ని వర్సిటీల్లోని పలువురు నిష్ణాతులైన ప్రొఫెసర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తద్వారా సదరు కమిటీ అన్ని జిల్లాలను దృష్టిలో ఉంచుకుని నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ప్రొఫెసర్ పాపిరెడ్డి నేతృత్వంలోని ఉన్నత విద్యామండలి ప్రొఫెసర్ల కమిటీ నివేదికకు తుది రూపునిచ్చింది. తద్వారా ఆ నివేదికను ఇటీవలే సర్కారు చెంతకు చేర్చింది. ఈ నివేదికలో తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోకి కొత్తగా నిర్మల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలను చేర్చింది.
ఈ నిర్ణయం అందుకేనా!
ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన వర్సిటీల పరిధిని నిర్ణయిస్తూ రూపొందించిన నివేదికపై ప్రస్తుతం చర్చ సాగుతున్నది. ప్రధానంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిని తగ్గించి దాని భారం తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎప్పటి నుంచో ఓయూ పరిధిని తగ్గించాలనే డిమాండ్ ఉంది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ప్రొఫెసర్ల కమిటీ రూపొందించిన నివేదిక ద్వారా ఆ ప్రక్రియకు మోక్షం కలగనుంది. ఈ నిర్ణయంతోనే ప్రస్తుతం ఓయూ పరిధిలోని ప్రస్తుత సిద్దిపేట జిల్లాను శాతవాహనకు, మెదక్ జిల్లాను తెలంగాణ యూనివర్సిటీకి మార్చారు. అయితే ప్రస్తుత సంగారెడ్డి జిల్లా పరిధిని మాత్రం ఓయూలోనే ఉంచారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రాంతాలు కూడా ఓయూకు దగ్గరగా ఉంటాయి. ఈ కారణంతోనే ఓయూ పరిధిని కాస్త తగ్గించినట్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పెరగనున్న కాలేజీలు, పని భారం
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రస్తుత తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో యూజీ, పీజీ, బీఎడ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల సంఖ్య పెరగనుంది. కొత్తగా నిర్ణయించిన పరిధి ప్రకారం వాటి సంఖ్య మరింతగా పెరగనుంది. దీంతోపాటే వర్సిటీ సిబ్బంది, అధికారుల పని భారం కూడా పెరగనున్నది. ప్రస్తుతం తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధి కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంటే కామారెడ్డి, నిజామాబాద్‌లో యూనివర్సిటీ, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యాల కింద 71 యూజీ, 15 బీఎడ్, 16 పీజీ, 3 ఎంబీఏ, ఒక ఎంసీఏ కాలేజీలు ఉన్నాయి. మెదక్ జిల్లాలో పది యూజీ, రెండు బీఎడ్, ఒక పీజీ కాలేజీ ఉన్నాయి. ఆదిలాబాద్‌లో ఐదు బీఎడ్, యూజీ, పీజీ కలిపి 56 వరకు ఉంటాయి. ఇక నిర్మల్ జిల్లాలో పీజీ కాలేజీ ఉన్నా దాన్ని రద్దు చేశారు. యూజీ కాలేజీలు మాత్రం 15 ఉన్నాయి. బీఎడ్ రెండు మినహా ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు లేవు.
బాధ్యత పెరుగుతుంది..
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధి పెరగడం గర్వంగా భావిస్తున్నాం. ఈ అఫిలియేషన్ ప్రక్రియ చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. గతంలో ఇక్కడ పని చేసిన వీసీలు కూడా ఈ ప్రక్రియ గురించి ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అది పూర్తి అవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కావడం ద్వారా వర్సిటీలోని అధికారులు, సిబ్బందికి మరింత బాధ్యత పెరుగుతుంది. అందరం మరింత నిబద్ధ్దతతో పని చేయాల్సి ఉంది.
-ప్రొఫెసర్ రవీందర్‌గుప్తా, టీయూ వీసీ
చాలా సంతోషంగా ఉంది..
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధి పెంచడం అనేది చాలా రోజులుగా అనుకుంటున్న అంశం. అది ఇప్పుడు సాకారం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కావడం ద్వారా అందరూ మరింత బాధ్యతగా పని చేయాల్సి ఉంది. అందుకు బోధన, బోధనేతర సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వానికి తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
-ప్రొఫెసర్ నసీం, టీయూ రిజిస్ట్రార్