విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలి
రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిర్మల్‌రెడ్డి
నిజామాబాద్ సిటీ, ఆగస్టు 18: ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఆహార భద్రత చట్టాన్ని అమలు చేస్తున్నాయని, గ్రామాల నుంచి మొదలుకొని జిల్లాస్థాయి వరకు అన్నార్థుల ఆకలి తీర్చాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిర్మల్ రెడ్డి అన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మరో ఇద్దరు సభ్యులతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించారు. నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో బుధవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆహార భద్రత చట్టం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ దుకాణాల ద్వారా రెండు కోట్ల 90 లక్షల మందికి, 20 లక్షలకు పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, 20 లక్షల మందికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిచేకూరుతున్నదని వివరించారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి సంతృప్తికరమైన సమాధానాలు వచ్చాయని తెలిపారు. రేషన్ కార్డులకు సబంధించిన అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొత్తగా రేషన్ షాపులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మూడు నెలల్లో ఫుడ్ కమిషన్ జిల్లాలో మరోసారి పర్యటిస్తుందని, అప్పటిలోగా విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో లోటుపాట్లు సరి చేయాల్సిన బాధ్యత కూడా అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. నిర్లక్ష్యం వహిస్తే ఏ చర్యలైనా తీసుకోవచ్చని చట్టంలో ఉందని తెలిపారు. అనంతరం జిల్లా విజిలెన్స్ కమిటీ కో-చైర్మన్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు మాట్లాడుతూ.. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ చట్టంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పేదలకు అందిస్తున్న సరుకుల వివరాలను అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. లాక్డౌన్ సమయంలో లబ్ధిదారులతోపాటు ప్రైవేట్ టీచర్లకు అదనంగా బియ్యం పంపిణీ చేశామని చెప్పారు. సమావేశంలో కమిషన్ సభ్యులు శారద, భారతి, మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్, ట్రైనీ ఐఏఎస్ మకరంద్, ఆర్డీవోలు శ్రీనివాస్, రవి, డీఆర్డీవో చందర్ నాయక్, డీఎస్వో వెంకటేశ్వర్లు, డీఈవో దుర్గాప్రసాద్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.