ప్రతిపక్షాలు పోటీ పడి పనిచేయాలి
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడలో డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన సభాపతి
విమర్శలను పట్టించుకోం..
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ, ఆగస్టు 18 : టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అభివృద్ధివైపే అడుగులు వేస్తారని, అనవసర విమర్శలను తాము పట్టించుకోమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ప్రతి చిన్న విషయాన్నీ రాజకీయం చేయడం మానుకొని, తమతో పోటీపడి పనిచేయాలని హితవు పలికారు. పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బుధవారం ఆయన పాల్గొన్నారు. పాత బాన్సువాడలో నిర్మించిన 28 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. రెడ్డి సంఘం ప్రహరీ, షెడ్డు, సంఘం పక్కనే వినాయక మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్జీవోస్ కాలనీలో రూ.30 లక్షల నిధులతో మనుమయ సంఘం కల్యాణ మండపం నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ సహకారంతో రూ.10వేల కోట్ల నిధులను తెచ్చి నియోజకవర్గంలో ప్రజా సంక్షేమంతోపాటు అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తుచేశారు. బాన్సువాడ మున్సిపాలిటీగా ఏర్పడ్డాక పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన రూ.25 కోట్లతో పట్టణంలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇటీవలే మరో రూ.25 కోట్లు మంజూరు చేశారని, వీటితో పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పార్టీలకతీతంగా, కులమతాల భేదం లేకుండా పేదలందరికీ సొంతిల్లు అందజేయాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. తాడ్కోల్ శివారులో వెయ్యి ఇండ్లు మంజూరు చేయగా, ఇప్పటికే 500 ఇండ్లు లబ్ధిదారులకు అందజేశామని, మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయని గుర్తుచేశారు. స్థలాలు ఉన్నవారికి మరో వెయ్యి ఇండ్లు మంజూ రు చేశామన్నారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని అన్నారు. తహసీల్దార్ గంగాధర్, పీఆర్ ఈఈ ప్రభాకర్, ఏఈ శంకర్, మున్సిపల్ కమిషనర్ రమేశ్ రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్లు కృష్ణారెడ్డి, శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ బాలకృష్ణ, వైస్ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, వైస్ చైర్మన్ జుబేర్, నాయకులు దొడ్ల వెంకట్రామ్రెడ్డి, మహ్మద్ ఎజాస్, గురు వినయ్ కుమార్, కొర్ల పోతురెడ్డి, ముదిరెడ్డి విఠల్ రెడ్డి, బాబా, కౌన్సిలర్లు పాశం రవీందర్ రెడ్డి, రమాదేవీ రాజాగౌడ్ , శ్రీనివాస్, హకీం, గైక్వాడ్ రుక్మిణి, తారా, మోతీరామ్, కిరణ్, రాజు, నర్సుగొండ, లింగమేశ్వర్ పాల్గొన్నారు.