అన్నదాత బ్యాంకు ఖాతాల్లో నగదు జమ
రెండో విడుతలో రూ.50 వేలలోపు రుణాలన్నీ మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో 57,908 మంది రైతులకు చేకూరనున్న లబ్ధి
వచ్చే ఏడాది రూ.75వేలలోపు రుణాల మాఫీ !
ఈ-కుబేర్ ద్వారా మాఫీ ప్రక్రియను చేపడుతున్న ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. రైతుబీమా, రైతుబంధు, రుణమాఫీతో రైతును రాజును చేసింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో సిరుల పంట పండిస్తున్న అన్నదాతకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగానే రుణమాఫీ చేస్తున్నది. రూ.50వేల లోపు పంట రుణం మాఫీ చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. నాలుగు రోజులుగా రుణమాఫీకి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతోంది. ఈ నెలాఖరులోగా రెండో విడుత రుణ మాఫీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రూ.50వేలలోపు రుణం తీసుకున్న రైతులు సుమారు 57వేల మంది ఉన్నారు. వీరికి రూ.175 కోట్ల వరకు మాఫీ అయ్యింది. నిజామాబాద్ జిల్లాకు రూ. 85.85 కోట్లు విడుదల కాగా.. 27,601 మంది, కామారెడ్డి జిల్లాకు రూ.89.79 కోట్లు మంజూరుకాగా.. 30,307 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది. అర్హులైన రైతుల ఖాతాల్లో నెలాఖరులోగా డబ్బులు జమ అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
నిజామాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులకు రూ.50వేల లోపు పంట రుణం మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. నాలుగు రోజులుగా రుణమాఫీకి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతోంది. ఈ నెలాఖరులోగా రెండో విడుత రుణ మాఫీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మొదట రూ.25వేలు లోపు రుణం తీసుకున్న రైతులకు మాఫీ కాగా రూ.50వేలు, రూ.75వేలు, రూ.లక్ష లోపు తీసుకున్న వారికి మాఫీ కాకపోవడంతో బ్యాంకుల్లో వడ్డీ చెల్లించి రుణాలను పునరుద్ధరించుకుంటున్నారు. రూ.50వేల లోపు ఉన్న రుణాలను వెంటనే మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు పూర్తి చేసి మాఫీ ప్రక్రియను చకచకా చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రూ.50వేలలోపు రుణం ఉన్నవారు సుమారు 57వేల మంది రైతులున్నారు. వారికి రూ.175 కోట్లు వరకు మాఫీ అయ్యింది. తక్షణం రుణమాఫీని అమలు చేయాలని సీఎం ఆదేశించడంతో బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో రుణ మాఫీకి అర్హులైన రైతుల జాబితా ప్రకారం ప్రక్రియను చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పంట రుణ మాఫీ పథకం కింద మొదటి విడుతలో రూ.25వేలలోపు రుణాలు ఉన్న రైతులకు ఇప్పటి వరకు 17,711 మందికి రూ.20.10 కోట్లు, కామారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో భాగంగా రూ.25వేలలోపు రుణాలు తీసుకున్న 20,984 మందికి రూ.24.64 కోట్లు మాఫీ జరిగింది.
రుణ మాఫీ వివరాలివీ…
నిజామాబాద్ జిల్లాలో రెండో విడుత రుణ మాఫీ కింద 27,601 మంది రైతులకు లబ్ధి చేకూరింది. వారికి సంబంధించిన రూ.50వేల అప్పును తీర్చే దిశగా ప్రభుత్వం రూ.85.85 కోట్లు విడుదల చేసింది. కామారెడ్డి జిల్లాలో రెండో విడుత రుణ మాఫీలో 30,307 మంది అర్హులున్నారు. వీరికి రూ.89.79కోట్లు కేటాయించారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 57,908 మంది రైతులకు సంబంధించిన రూ.50వేలలోపు రుణాల మాఫీకి రూ.175.64కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఆగస్టు 16వ తేదీ నుంచి మొదలైన రుణ మాఫీ ప్రక్రియ నెలాఖరులోగా అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
అన్నదాతకు ఊరట
రుణ మాఫీ ఎప్పడవుతుందోనని ఎదురు చూసిన వారందరికీ ఊరట కలిగింది. జూన్ 2020లో తొలి విడుతలో రూ.25వేలలోపు అప్పు ఉన్న రైతుల రుణం మాఫీ చేస్తూ నిధులు విడుదల చేసింది. జిల్లాలో వేలాది మందికి అప్పట్లో రుణ మాఫీ జరిగింది. తాజాగా రూ.50వేల లోపు రుణం ఉన్నవారికి మాఫీ చేసింది. డిసెంబర్ 11, 2018 నాటికి రూ.లక్ష అప్పు ఉంటే మాఫీ చేసేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నిర్ణీత తేదీ నాటికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అనుసంధానంతో కుటుంబానికి రూ.లక్ష లోపు ఉన్న అప్పును తేల్చే పనిలో నిమగ్నమవడంతో రుణ మాఫీలో జాప్యం ఎదురైంది.
ఈ-కుబేర్ ద్వారా జమ
రైతు రుణ మాఫీ ప్రక్రియ ఈ-కుబేర్ ద్వారా జమ చేస్తున్నారు. జిల్లాలో రూ.50వేలలోపు బ్యాంకుల్లో రుణాలున్న రైతులందరి బ్యాంకు ఖాతాల్లో ఈ నెలాఖరు వరకు డబ్బులు జమవుతాయి. రైతుబంధు తరహాలోనే ఈ-కుబేర్ ద్వారా నగదు బదిలీ అవుతోంది. ఎన్నికల హామీలో భాగంగా రూ.లక్షలోపు రుణమాఫీపై సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. గతంలో రూ.25వేల వరకు మాఫీ కాగా ఈ విడుతలో రూ.50వేలలోపు రుణాలను రద్దు చేశారు. ఉభయ జిల్లాల్లో రెండో విడుత అర్హుల జాబితాను బ్యాంకర్లు ఇప్పటికే సిద్ధం చేశారు. రుణ మాఫీని ప్రభుత్వం మొత్తం నాలుగు విడుతలుగా బ్యాంకులకు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. అన్నదాతలను అప్పుల ఊబి నుంచి తప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం పంట రుణ మాఫీ ప్రక్రియను తెలపెట్టింది. ప్రతి రైతుకు రూ.లక్ష వరకు రుణాన్ని మాఫీ చేస్తామని 2018 శాసనసభ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ మేనిఫెస్టో అంశాన్ని అమలు చేసేలా సీఎం కేసీఆర్ నడుం కట్టారు. 2014 లోనూ రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేసింది. పంట రుణం, బంగారం రుణమున్నా, ఎన్ని బ్యాంకుల్లో రుణమున్నా గరిష్టంగా ఒక్కో రైతుకూ రూ.లక్ష వరకు మాఫీ చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా సుమారుగా లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. ఈ మొత్తాన్ని ఏడాదికి ఒకసారి పావు వంతు చొప్పున నాలుగు దఫాలుగా, నాలుగు సంవత్సరాల పాటు రైతుల బ్యాంకు అకౌంట్లకు జమ చేశారు.
రుణమాఫీ అభినందనీయం
డిచ్పల్లి, ఆగస్టు 18: ముఖ్యమంత్రి కేసీఆర్ 50వేల రూపాయల రుణమాఫీ చేయడం హర్షణీయం. రైతు బాంధవుడిగా రైతుల కష్టసుఖాలను గుర్తెరిగిన ముఖ్యమంత్రి లక్ష రూపాయలలోపు రుణమాఫీ చేయడం అభినందనీయం. మొదటి విడుతలో రూ.25వేలు, రెండో విడుతలో రూ.50వేలు రుణమాఫీ చేయడంతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. సీఎం కేసీఆర్కు రైతులు జీవితాంతం రుణపడి ఉంటారు. -లక్కం కిష్టారెడ్డి, రైతు, సుద్దులం
చాలా సంతోషంగా ఉంది
రైతులను ఆదుకుంటున్న దేవుడు సీఎం కేసీఆర్. వ్యవసాయానికి పెట్టుబడికి రైతు బంధు ఇస్తున్నడు. పింఛన్లు ఇస్తున్నడు. రుణమాఫీ చేస్తున్నడు.చాలా సంతోషంగా ఉంది. సారు సల్లగుండాలె. గతంలో ఏ ప్రభుత్వాలూ రైతులను ఆదుకోలేవు. తెలంగాణ వచ్చాక అన్ని పనులు అవుతున్నాయి. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-బుక రాజిరెడ్డి, రైతు, చీమన్పల్లి, సిరికొండ మండలం