ఆర్మూర్, అక్టోబర్ 16 : ‘స్ట్రీట్ ఫైట్ కాదు.. స్ట్రెయిట్ ఫైట్‌కు రా.. దమ్ముంటే ఆర్మూర్‌లో నా మీద పోటీ చేసి గెలిచి చూపించు..’ అంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం రాత్రి ఆయన దుబాయి నుంచి ఫేస్బుక్ లైవ్ ద్వారా మాట్లాడారు. అర్వింద్.. ఒక ఎఫ్-3 ఎంపీ అంటూ ఎద్దేవా చేశారు. ఎఫ్-3 అంటే.. ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్ అంటూ విమర్శించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రైతులను మోసం చేసి రాసిచ్చిన బాండ్ పేపర్ ఫేక్ బాండ్ అయ్యిందన్నారు. ఫ్రాడ్ సర్టిఫికెట్ల ద్వారా విద్యాభ్యాసం చేశాడని, వాటికి సంబంధించిన సర్టిఫికెట్లు సోషల్ మీడియాలో ఉన్నాయన్నారు. ఫాల్స్ స్టేట్మెంట్ల ద్వారా ప్రజలను అర్వింద్ తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. తాను దుబాయికి వెళ్లలేనని అర్వింద్ అన్నాడని, ప్రస్తుతం ఆయన దుబాయిలోనే మూడు రోజులుగా ఉన్నట్లు చెబుతూ.. అక్కడి నుంచే సవాల్ విసిరారు. ఈ దసరా పండుగ నుంచైనా అరవింద్ అబద్ధాలను మాట్లాడడం మానుకోని, ప్రజాసేవ, నిజాయితీ అలవర్చుకోవాలని హితవుపలికారు.