బాన్సువాడ , ఆగస్టు 16: పట్టణంలో అన్ని వసతులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను త్వరలో ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకువస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం బాన్సువాడలోని వీక్లీమార్కెట్లో స్థలాన్ని పరిశీలించారు. దగ్గరుండి అధికారులతో కొలతలు తీయించారు. అనంతరం మాట్లాడుతూ.. రూ.4. 50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కుల, మత, రాజకీయా లకు అతీతంగా పేదలకు డబుల్‌బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలన్నదే తన కోరిక అని చెప్పారు. పట్టణంలో ఇండ్లులేని పేదలు ఉంటే, వారికి రూ.5.30 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. బాన్సువాడ వంద పడకల దవాఖాన నుంచి మాతాశిశు దవాఖాన వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇం దుకోసం రూ. మూ డు కోట్లతో అంచనా లు రూపొందించగా, ఇప్పటికే ఆర్అండ్ బీ శాఖ ప్రతిపాదన లు సిద్ధం చే సిందని తెలిపారు. ఏరియా దవాఖానకు ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు కాగా, ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. బాన్సువాడలో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల వద్ద రూ.40 కోట్లతో అన్ని వసతులతో కళాశాల భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. కళాశాలలో నాలుగు వందల మంది ఉంటారని తెలిపారు. 40 మంది టీచింగ్, 68 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారని వివరించారు. తుది నివేదిక రాగానే అడ్మిషన్లు ప్రారంభిస్తారని తెలిపారు. స్పీకర్ వెంట ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ గంగాధర్, గిర్దావర్ రామకృష్ణ, సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, నాయకులు మహ్మద్ ఎజాస్, గురువినయ్ కుమార్, కౌన్సిలర్లు లింగమేశ్వర్, ఆమేర్, హకీం, కిరణ్‌కుమార్, కాల్వ శ్యాం కుమార్ తదితరులు ఉన్నారు.